నేలకొరుగుతూ..ఆయుధాలు వీడుతూ..
అంతిమ దశకు మావోయిస్టు ఉద్యమం?
కేంద్రం విధించిన డెడ్‌లైన్‌లోపే కనుమరుగు !
వరుస ఎన్‌కౌంటర్లతో అగ్రనేతలు మృతి
సరెండర్ అవుతున్న టాప్ మోస్ట్ లీడర్లు
తాజాగా తెలంగాణలో 41 మంది లొంగుబాటు
రాష్ట్రం నుంచి పార్టీలో మిగిలింది 54 మంది
గణపతి, తిరుపతి, రాజిరెడ్డి, హనుమంతు, నరహరి సీసీలో..
రాష్ట్ర కమిటీలోనూ పలువురు కీలక బాధ్యతలు
తాజాగా ప్రకటించిన డీజీపీ డీజీపీ శివధర్ రెడ్డి
కాకతీయ, తెలంగాణ బ్యూరో: భారతదేశ అంతర్గత భద్రతకు దశాబ్దాలుగా సవాల్ విసురుతున్న మావోయిస్ట్ ఉద్యమం చివరి దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర కలిగిన మావోయిస్టు (అప్పటి పీపుల్స్ వార్) పార్టీ నేడు తీవ్ర ఒడిదొడుకులకు గురవుతోంది. వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో సతమతమవుతోంది. ఇన్నాళ్లు నక్సలైట్లను అక్కున చేర్చుకున్న దండకారణ్యంలో మనలేని పరిస్థితులు నెలకొనడంతో అనేకమంది అగ్రనేతలు ఉద్యమాన్ని వీడుతున్నారు. మరికొందరు కీలక నేతలు వరుస ఎన్‌కౌంటర్లలో హతమవుతున్నారు. ప్రస్తుతం పార్టీలో కీలకంగా ఉన్న మరికొందరు సైతం ఉద్యమాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలిసేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా పార్టీకి ఎదురవుతున్న గడ్డు పరిస్థితుల నేపథ్యంలో ఉద్యమంలో పురోగమించే అవకాశం లేదని గ్రహించిన నేపథ్యంలోనే ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా అబూజ్మడ్ గుండెకోట్లో మే 21న పార్టీ ప్రధాన కార్యదర్శి బస్వరాజ్ ఎన్కౌంటర్.. తాజాగా ఏపీలోని మారేడుమిల్లిలో హిడ్మా మృతి చెందిన అనంతరం శ్రేణుల్లో తీవ్ర నిరాశ నెలకొంది.
అగ్రనేతల లొంగుబాట్లు
కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్‌తో మావోయిస్టు పార్టీకి మూల స్తంభాలుగా ఉన్న అగ్రనేతలు ఎన్‌కౌంటర్లలో మరణించగా ఆ ప్రభావంతో ఇంకొందరు స్వచ్ఛందంగా తమ కేడర్‌తో పెద్దఎత్తున లొంగిపోతున్నారు. మావోయిస్టు చరిత్రలోనే అతిపెద్ద లొంగుబాటు అక్టోబర్‌లో చోటుచేసుకుంది. ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను అలియాస్ అభయ్‌తోపాటు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న తమ సహచరులు 139 మందితో ఛత్తీస్‌గడ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రుల ఎదుట సరెండర్ అయ్యారు. ఈ భారీ లొంగుబాటు మావోయిస్టు ఉద్యమ చరిత్రలోనే కీలక ఘట్టంగా నిలిచింది. ఇది నక్సలిజం నిర్మూలనకు పోలీసుల ప్రయత్నాలకు బలం చేకూర్చింది. అనంతరం ఛత్తీస్‌గఢ్‌తో పాటు తెలంగాణలోనూ ఈ మధ్యకాలంలో పలువురు అగ్రనేతలు ఆయుధాలను వదిలి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. గత నవంబర్ నెలలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు సహా మొత్తం 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టులకు ప్రజల మద్దతు తగ్గిందని, పార్టీ నెట్వర్క్ నిర్వీర్యం అయిందని, అనారోగ్యాల బారిన పడ్డారని, సిద్ధాంతపరమైన విభేదాలు, పునరావస కార్యక్రమాలతో లొంగుబాట్లు జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఈక్రమంలోనే శుక్రవారం తెలంగాణ డీజీపీ ఎదుట 41 మంది మావోయిస్టులు లొంగిపోవడం గమనార్హం.

బస్వరాజ్, హిడ్మా ఎన్‌కౌంటర్లతో కోలుకోలేని దెబ్బ
మే 21న మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్, పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్ ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్లో హతమవడం వామపక్ష తీవ్రవాదంపై పోరాటంలో ప్రధాన పురోగతిగా భద్రతా దళాలు భావించాయి. 2018లో గణపతి స్థానంలో బసవరాజు సీపీఐ (మావోయిస్ట్) ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇక నవంబర్ 18న ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు మోస్ట్ వాంటెండ్, పీఎల్‌జీఏ ఫ్టస్ బెటాలియన్ కమాండర్, కేంద్ర కమిటీ సభ్యుడు మాద్వి హిడ్మాతోపాటు ఆయనే సహచరి రాజే ప్రాణాలు కోల్పోయారు. దండకారణ్యంలో దశాబ్దాలుగా గెరిల్లా దాడులకు వ్యూహకర్తగా ఉన్న హిడ్మా మృతి ఉద్యమానికి భారీ నష్టంగా భావిస్తున్నారు. నాయకత్వ రాహిత్యంతో క్యాడర్ జనజీవన స్రవంతిలో కలుస్తోంది. అనంతరం ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన పలు ఎన్‌కౌంటర్లలో అనేక మంది మావోయిస్టులు మృతిచెందారు.

తెలంగాణ నుంచి మిగిలింది 54 మంది
ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో మొత్తం 54 మంది మాత్రమే తెలంగాణవాళ్లు ఉన్నారని, వీరిలో ఆరుగురు మాత్రమే రాష్ట్రంలో పని చేస్తున్నారని డీజీపీ శివధర్ రెడ్డి తాజాగా ప్రెస్‌మీట్‌లో స్పష్టంగా ప్రకటన చేశారు. ఇందులో కేంద్ర కమిటీలో ఉన్న వాళ్లలో ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి, తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, మల్ల రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, పాక హనుమంతు, పసునూరి నరహరి తెలుగువారే. మరో పది మంది తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల్లో రాష్ట్ర కమిటీ హోదాలో పనిచేస్తున్నారు. వీరిలో ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లికి చెందిన బడే చొక్కారావు అలియాస్ దామోదర్ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఇంకా గంకిడి సత్యనారాయణ రెడ్డి, కంకణాల రాజిరెడ్డి, ముప్పిడి సాంబయ్య, పవనానందరెడ్డి, జోడే రత్నభాయ్ అలియాస్ సుజాత, లోకేటి చందర్, శేఖర్ అలియాస్ మంతు, మేకల మనోజ్, కర్ర వెంకటరెడ్డి రాష్ట్ర కమిటీ సభ్యులుగా కొనసాగుతున్నట్లు పోలీస్ రికార్డులు చెబుతున్నాయి. తెలంగాణ కమిటీలో ప్రస్తుతం రాష్ట్రానికి చెందినవారు నలుగురు ఉండగా మిగిలిన వారంతా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారే. అలాగే తెలంగాణకు చెందిన మావోయిస్టులు ఇతర రాష్ట్రాల కమిటీల్లోనూ కీలకంగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.



