దుర్షేడ్లో ఫేక్ రిజిస్ట్రేషన్ల కలకలం
తప్పుడు సర్వే నంబర్లతో ఫేక్ రిజిస్ట్రేషన్లు..?
భూ దందాదారుల అక్రమాలపై స్థానికుల ఆగ్రహం
కాకతీయ, కరీంనగర్ : దుర్షేడ్ ప్రాంతంలో తప్పుడు సర్వే నంబర్లతో భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. భూముల ధరలు పెరగడంతో అక్రమాలు పెరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. నగరపాలక సంస్థ నాలుగో డివిజన్ పరిధిలో ఈ ఘటన చర్చనీయాంశమైంది. మునుపు గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఈ ప్రాంతం కార్పొరేషన్లో విలీనమైన తర్వాత భూముల విలువలు భారీగా పెరిగాయి. ఈ పరిస్థితిని ఉపయోగించుకుని కొంతమంది భూ దందాదారులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. రాజీవ్ రహదారి సమీపంలోని సర్వే నంబర్లను తప్పుగా చూపించి ఇతర ప్రాంతాల భూములను రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు సమాచారం. తప్పుడు పత్రాలతో ఇంటి నంబర్లు కూడా పొందుతున్నారని స్థానికులు పేర్కొన్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ వ్యవహారం సాగుతోందని విమర్శించారు. ఈ అంశంపై వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తప్పుడు రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని కోరుతున్నారు.


