ములుగు జీపీలో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం
రికార్డులో పేరు లేకున్నా ధ్రువపత్రం జారీ
పైకం ఇస్తే ఏ పత్రమైనా అందుబాటులోకి..?
విచారణ జరిపితే మరిన్ని వెలుగులోకి..
కాకతీయ, ములుగు : జిల్లా కేంద్రంలోని ములుగు గ్రామపంచాయతీ(మున్సిపాలిటీగా మారకముందు)లో నకిలీ ధ్రువపత్రాల బాగోతం బయటపడింది. చేతిలో అధికారం ఉన్నంత మాత్రాన లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చూపిస్తూ పత్రాలు జారీ చేసిన ఘటన వెలుగులోకి రావడంతో జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పైకం చెల్లిస్తే ఏ ధ్రువపత్రమైనా జారీ చేస్తారన్న ఆరోపణలు ప్రజల్లో తీవ్ర ఆగ్రహం రేపుతున్నాయి.
201లోనే అవకతవకలు
ములుగు మున్సిపాలిటీ ఏర్పడక ముందు, 2019లో ములుగు గ్రామపంచాయతీ కార్యాలయంలో ఈ అవకతవకలు చోటుచేసుకున్నాయి. ఒక మహిళ తనపై ఉన్న ఇంటికి సంబంధించిన ధ్రువీకరణ పత్రం కావాలని పంచాయతీ కార్యాలయాన్ని సంప్రదించింది. రికార్డుల్లో ఎలాంటి పేరు లేకపోయినా, నాటి కార్యదర్శి, సిబ్బంది సహకారంతో ఉన్నట్టుగా చూపించి ధ్రువీకరణ పత్రం జారీ చేశారు అని, ఆ పత్రం ఆధారంగా ఆ మహిళ తన భర్త పేరుతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇంటి రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేసుకుంది అని, లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చిత్రీకరించడం ఎంత సులువో ఈ ఘటన మళ్లీ రుజువు చేస్తోందని జిల్లా ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.
సమాచార హక్కు చట్టంతో బయటపడ్డ బాగోతం..
ఈ వ్యవహారం తాజాగా ఒక యువకుడు సమాచార హక్కు చట్టం (ఆర్.టి.ఐ) ద్వారా వివరాలు కోరడంతో వెలుగులోకి వచ్చింది. పంచాయతీ రికార్డుల్లో లేని పేర్లపై ఇంటి ధ్రువీకరణ పత్రాలు ఇచ్చినట్టు సమాచారం బయటపడింది. ఇది ఒక్క ఘటన మాత్రమే అయినా, ఇలాంటి అవకతవకలు మరెన్నో జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజలలో వినిపిస్తున్న ఆరోపణల ప్రకారం, ఇంటి ధ్రువీకరణ పత్రాలు, ఇంటి అనుమతి పత్రాలు ఇవ్వడంలో లక్షల రూపాయలు చేతులు మారాయని, నిబంధనలు పక్కన పెట్టి డబ్బులు తీసుకుని సర్టిఫికెట్లు జారీ చేయడం పంచాయతీలో అలవాటుగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ధ్రువపత్రం కావాలంటే పైకం తప్పనిసరి అని, రికార్డులో ఉన్నా లేకపోయినా బేరం కుదిరితే సరిపోతుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విచారణ జరిపితే మరిన్ని వెలుగులోకి ..
జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో విచారణ జరిపితే ములుగు గ్రామపంచాయతీలో మరెన్నో అవకతవకలు బయటపడతాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. రికార్డులు తారుమారు చేసి ఇచ్చిన సర్టిఫికెట్లు ఎంతమేర ఉపయోగించబడ్డాయన్నది కూడా పెద్ద ప్రశ్నగా మారింది.


