ఏఐతో నకిలీ ప్రకటనలు.. వివాదాలు
ఆటగాళ్ల పేరుతో తప్పుడు వ్యాఖ్యలు వైరల్
క్రీడా సంస్థలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
అధికారిక వేదికల నుంచే సమాచారాన్ని నమ్మాలని సూచన
కాకతీయ, స్పోర్ట్స్ : కృత్రిమ మేధస్సు సాంకేతికతతో రూపొందిస్తున్న తప్పుడు సమాచారం ప్రపంచ క్రీడా వ్యవస్థకు పెరుగుతున్న ముప్పుగా మారిందని ఒక తాజా అధ్యయనం హెచ్చరించింది. ఏఐ ప్రమాదాలపై పరిశోధనలు చేసే సంస్థ అలెథియా విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ నివేదిక ప్రకారం ప్రముఖ ఆటగాళ్ల పేరుతో తప్పుడు ప్రకటనలు, కల్పిత వివాదాలు, అసత్య వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఆ వార్తలు వైరల్ అయిన తర్వాతే అవి నకిలీ అని తేలుతున్నాయని పేర్కొన్నారు. జెనరేటివ్ ఏఐ అభివృద్ధి వల్ల ఇప్పుడు తక్కువ సమయంలోనే భారీ స్థాయిలో నకిలీ కంటెంట్ తయారు చేయడం సులభమైందని అధ్యయనం తెలిపింది. గతంలో మానవులే పునరావృతంగా ప్రచారం చేయాల్సి వచ్చేదైనా ఇప్పుడు ఏఐ ఆధారిత నెట్వర్క్లు జట్లు, లీగులు, ఆటగాళ్లను అనుకరిస్తూ నకిలీ చిత్రాలు, ప్రకటనలు సృష్టిస్తున్నాయి. ఇలాంటి నకిలీ వార్తలు కేవలం ఆటగాళ్ల ప్రతిష్టకే కాదు, క్రీడా రంగానికి కూడా నష్టాన్ని కలిగించే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. తప్పుడు పోస్టుల్లో ఉండే లింకుల ద్వారా అభిమానులు ఆర్థిక మోసాలకు గురయ్యే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించింది. కొన్ని సందర్భాల్లో ఈ సమాచారం క్రీడా పందేలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశోధకులు తెలిపారు. ఒకే ఆటగాడు ఒకేసారి వేర్వేరు జట్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తప్పుడు ప్రకటనలు రావడం వంటి అసంబద్ధతలు ఎక్కువగా ఏఐ సృష్టించిన ప్రచారాల్లో కనిపిస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో క్రీడా సంస్థలు డిజిటల్ అపోహలను వ్యూహాత్మక ప్రమాదంగా పరిగణించాలని అలెథియా సూచించింది. అధికారిక జట్లు, లీగ్ వేదికల నుంచే వచ్చిన సమాచారాన్ని మాత్రమే నమ్మాలని అభిమానులకు సూచించింది. అనుమానాస్పద లింకులు, సంచలనాత్మక పోస్టుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని నివేదిక హెచ్చరించింది.


