ఉద్యోగాల భర్తీలో పాలకుల వైఫల్యం
కాకతీయ, కరీంనగర్ : ఖాళీ ఉద్యోగాల భర్తీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎం. రఘుపతి తీవ్ర విమర్శలు చేశారు. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) నాయకుల సమావేశం జిల్లా కేంద్రంలో నిర్వహించగా, ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చినా, నేటికీ ఆ మాటలను అమలు చేయడం లేదని రఘుపతి విమర్శించారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఉద్యోగాల కల్పన విషయంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. దేశంలో అధిక శాతం ఉన్న యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ భవిష్యత్తుపై నమ్మకం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా వేయలేదని మండిపడ్డారు. ఉద్యోగ కల్పనపై పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, వెంటనే ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తక్షణమే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని రఘుపతి కోరారు. ఈ సమావేశంలో డివైఎఫ్ఐ నాయకులు అరవింద్, విజయ్, చందు, అజయ్, ఉదయ్ సింగ్, మహేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు


