రేగళ్ల పెద్దతండాలో ఫ్యాక్టరీ?
అటవీ భూముల్లో పరిశ్రమ ఎలా?
ఏజెన్సీ చట్టాలకు తూట్లు పొడుస్తున్నారా!!
గిరిజన భూములకు మంగళం పాడే ప్రయత్నమా..!?
వైల్డ్ ఫారెస్ట్‌లో అనుమతులు ఎవరు ఇచ్చారు?
ఉద్యోగాల పేరుతో వసూళ్ల పర్వం?
జిల్లా కలెక్టర్ జోక్యం తప్పనిసరంటున్న గిరిజనులు
ప్రత్యక్ష పోరాటానికి గిరిజనులు సన్నద్ధం
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని *రేగళ్ల పెద్దతండా*లో టెక్స్టైల్ ఫ్యాక్టరీ స్థాపన పేరుతో జరుగుతున్న వ్యవహారం గిరిజన ప్రాంతంలో కలకలం రేపుతోంది. పూర్తిస్థాయి ఏజెన్సీ గ్రామాలతో, దట్టమైన అటవీ ప్రాంతాలతో చుట్టు ముట్టబడి ఉన్న ఈ గ్రామంలో నూరుశాతం గిరిజనులే నివసిస్తున్నారు. ఒకప్పుడు నక్సల్స్ ప్రభావిత ప్రాంతంగా ఉన్న ఈ గ్రామ ప్రజలు ఉపాధి కోసం వలస వెళ్లిన దశలూ ఉన్నాయి. అయితే, ప్రస్తుతం ఎలాంటి అనుమతులు లేకుండానే అటవీ భూముల్లో ఫ్యాక్టరీ స్థాపించేందుకు కొందరు పెద్దలు శత విధాల ప్రయత్నాలు చేస్తున్నారని గిరిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడవి, వన్యప్రాణ సంరక్షణ భూములు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో పరిశ్రమ స్థాపన ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

అటవీ భూముల్లో పరిశ్రమ ఎలా?
రేగళ్ల పెద్దతండా పంచాయతీ పరిధిలోని మూన్య తండా వద్ద గిరిజనుల సాగులో ఉన్న భూమిని అకస్మాత్తుగా టెక్స్టైల్ ఫ్యాక్టరీ పేరుతో చదును చేయడంపై స్థానికులు ఆందోళనకు దిగారు. ఈ ప్రాంతంలో 95 శాతం మేర బంజారా గిరిజనులు అటవీ భూముల్లో సాగు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టాదారు పాసు పుస్తకాల కోసం కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న గిరిజనులకు ఇప్పటివరకు న్యాయం జరగలేదు. కొంతమంది గిరిజనులు తమ భూముల హక్కుల కోసం న్యాయస్థానాల మెట్లు కూడా ఎక్కారు. గతంలో దొరల ఆధీనంలో ఉన్న భూములను స్వాధీనం చేసుకునేందుకు గిరిజనులు పోరాటాలు చేసినా, డబ్బు బలం ముందు ఓడిపోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గిరిజనుల మధ్య చిచ్చు
దొరలు ఇతర ప్రాంతాలకు వెళ్లిన తరువాత, గిరిజనుల భూములను అటవీ హక్కుల చట్టం ప్రకారం వారి పేర్లపై నమోదు చేయకుండా, అదే గ్రామంలో ఉన్న కొంతమంది గిరిజనులను ఉపయోగించి గిరిజనులకు గిరిజనుల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేగళ్ల పెద్దతండా పరిసర ప్రాంతాల్లో సగానికి సగం అటవీ భూమి ఉంది. కిన్నెరసాని అభయారణ్యం సరిహద్దులో ఉండటంతో వన్యప్రాణ సంరక్షణ నిబంధనలు కఠినంగా ఉన్నాయి. అటువంటి ప్రాంతంలో పరిశ్రమ స్థాపన జరిగితే కాలుష్య ప్రభావంతో గ్రామ జీవనం అస్తవ్యస్తమయ్యే ప్రమాదం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు అభివృద్ధి పనులు కూడా అటవీ అనుమతుల లేమితో నిలిచిపోయిన ఈ ప్రాంతంలో, పరిశ్రమలకు ఎలా అనుమతులు వస్తాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టెక్స్టైల్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో ఇంటికో ఉద్యోగం ఇస్తామని కొందరు బినామీలు ప్రచారం చేస్తూ గిరిజన యువత నుంచి వసూళ్లకు తెరలేపినట్లు సమాచారం. ఒక్కొక్కరి వద్ద పది నుంచి పదిహేను వేల రూపాయల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫ్యాక్టరీ పేరుతో అమాయక గిరిజన యువతను మోసం చేస్తున్నారని గ్రామస్థులు మండిపడుతున్నారు.
అనుమతులు లేవు : డీఎఫ్‌వో కిష్టగౌడ్
ఈ వ్యవహారంపై డీఎఫ్‌వో కిష్టగౌడ్ స్పందించారు. “రేగళ్ల ప్రాంతంలోని అటవీ భూముల్లో ఎవరికీ పట్టాలు లేవు. గతంలో హైకోర్టు కూడా ఈ అంశాన్ని త్రోసిపుచ్చింది. అటవీ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు, ఎన్ఓసీలు ఇవ్వలేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుమతి లేకుండా ఫ్యాక్టరీ స్థాపన అసాధ్యం” అని తెలిపారు. ఫ్యాక్టరీ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న దళారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అమలులో ఉన్న అటవీ హక్కుల చట్టం, పీసా చట్టాలను ఉల్లంఘించి ఫ్యాక్టరీ ఏర్పాటు ప్రయత్నాలు జరుగుతున్నాయని గిరిజనులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి, ఫ్యాక్టరీ పేరుతో జరుగుతున్న వసూళ్లను ఆపాలని, గిరిజన భూములను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధమని హెచ్చరిస్తున్నారు. మొత్తానికి, రేగళ్ల పెద్దతండాలో ఫ్యాక్టరీ పేరుతో జరుగుతున్న ఈ వ్యవహారం గిరిజనుల అభివృద్ధికా? దోపిడీకా? అనే ప్రశ్నలను బలంగా లేవనెత్తుతోంది.



