చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ
అనుభవానికి ప్రాధాన్యం ఇస్తారా ?
కొత్త ముఖానికి అవకాశం కల్పిస్తారా ?
కేటీఆర్ నిర్ణయం కోసం ఎదురుచూపులు
సిరిసిల్లలో 39 వార్డులకు బీఆర్ఎస్‌కు 27..
ఈసారి చైర్మన్ పీఠం జనరల్ మహిళకు రిజర్వేషన్
నలుగురు కౌన్సిలర్ల మధ్య టఫ్ వార్
వైస్ చైర్మన్ కోసం యువ, సీనియర్ల మధ్య గట్టి పోటీ
కొన్ని గంటల్లోనే తేలనున్న భవితవ్యం
కాకతీయ, రాజన్న సిరిసిల్ల : సిరిసిల్ల మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక సోమవారం జరగనున్న నేపథ్యంలో పట్టణ రాజకీయాలు వేడెక్కాయి. గతంలో బీసీ మహిళగా ఉన్న చైర్మన్ రిజర్వేషన్ ఈసారి జనరల్ మహిళకు కేటాయించారు. మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 39 వార్డుల్లో బీఆర్ఎస్ 27 స్థానాలు గెలుచుకుని స్పష్టమైన మెజారిటీ సాధించింది. కాంగ్రెస్ 6, బీజేపీ 5, స్వతంత్రులు ఒక స్థానాన్ని దక్కించుకున్నారు. సంఖ్యా బలం దృష్ట్యా చైర్మన్ పదవి బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లడం ఖాయమే అయినప్పటికీ, ఎవరికీ అవకాశం దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది. సిరిసిల్ల మున్సిపాలిటీగా ఏర్పడినప్పటి నుంచి చైర్మన్ పదవి బీసీవర్గానికే కేటాయించారు. ఒకసారి బీసీ జనరల్, ఐదుసార్లు బీసీ మహిళ కేటగిరీలకు రిజర్వేషన్ లభించింది. పట్టణంలో బీసీవర్గాలు, ముఖ్యంగా పద్మశాలీల ప్రాబల్యం ఎక్కువగా ఉండటంతో ఈ విధంగా రిజర్వేషన్ కొనసాగింది. ఈసారి జనరల్ మహిళకు రిజర్వేషన్ కేటాయించడంతో ఇతర వర్గాలకు చెందిన మహిళా కౌన్సిలర్లకు అవకాశం లభించింది.
రేసులో నలుగురు కౌన్సిలర్లు
చైర్‌పర్సన్ పీఠం కోసం నలుగురు మహిళా కౌన్సిలర్లు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. 3వ వార్డు నుంచి కౌన్సిలర్ గా గెలిచిన జిందం కళా చక్రపాణి, 5వ వార్డు నుంచి గెలిచిన దార్ణం అరుణ లక్ష్మీనారాయణ,
17వ వార్డు నుంచి గెలిచిన గుండ్లపెల్లి నీరజ పూర్ణచందర్, 30వ వార్డు నుంచి గెలిచిన మంచె రేణుక శ్రీనివాస్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తున్నట్లు సమాచారం. జిందం కళా చక్రపాణి ఇప్పటికే వరుసగా రెండుసార్లు చైర్మన్‌గా పనిచేసిన అనుభవం ఉండటం ఆమెకు బలంగా మారింది. పరిపాలనలో అనుభవం ఉన్న అభ్యర్థిగా ఆమెకు మద్దతు లభిస్తుందన్న ప్రచారం సాగుతోంది. గుండ్లపెల్లి నీరజ పూర్ణచందర్ కుటుంబానికి మున్సిపల్ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉండటం, గతంలో తన భర్త పూర్ణచందర్ తల్లి గుండ్లపెల్లి సరోజన చైర్మన్‌గా సేవలు అందించిన అంశం ఆమె వర్గం ప్రస్తావిస్తోన్నట్లు తెలిసింది. మంచె రేణుక శ్రీనివాస్ కుటుంబానికి గత పాలకవర్గంలో వైస్ చైర్మన్ పదవి ఉన్న నేపథ్యంలో ఈసారి చైర్మన్ పీఠం తమకే రావాలన్న వాదన వినిపిస్తోంది. దార్ణం అరుణ లక్ష్మీనారాయణ కూడా గట్టిగానే ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం.
వైస్ చైర్మన్ పీఠానికి పోటీ
చైర్మన్ ఎన్నికతోపాటు వైస్ చైర్మన్ పదవిపై కూడా పోటా పోటీ నెలకొంది. యువ కౌన్సిలర్లకు అవకాశం ఇవ్వాలన్న అభిప్రాయం ఒకవైపు వినిపిస్తుండగా, అనుభవజ్ఞులైన సీనియర్ సభ్యులు కూడా తమ హక్కు ఉందని భావిస్తున్నారు. గత పాలకవర్గంలో కీలక పాత్ర పోషించిన సభ్యులు ఈసారి ఉన్నత పదవిని ఆశిస్తున్నారు.
క్యాంపులో కౌన్సిలర్లు
మున్సిపల్ ఫలితాల అనంతరం బీఆర్ఎస్ తరపున గెలిచిన కౌన్సిలర్లు అందరినీ ముందు జాగ్రత్త చర్యగా పార్టీ అధిష్టానం క్యాంపునకు తరలించింది. అక్కడే చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక కోసం కౌన్సిలర్లతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ చర్చలు జరిపినట్లు సమాచారం. అధికారికంగా ఏమీ ప్రకటించకపోయినా పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు ఏకగ్రీవ ఎన్నిక జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చైర్మన్ ఎవరు అనేది డిసైడ్ చేయడంలో కేటీఆర్ కీలక పాత్ర పోషిస్తుండడంతో ఆయన నిర్ణయంపై జిల్లా రాజకీయ వర్గాలు, పార్టీ కార్యకర్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సోమవారం జరగనున్న ఎన్నిక ఫలితం సిరిసిల్ల మున్సిపల్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తోందన్న చర్చ జరుగుతోంది. అనుభవానికి ప్రాధాన్యం ఇస్తారా? లేక కొత్త ముఖానికి అవకాశం కల్పిస్తారా? పార్టీ అధిష్టానం ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందన్నదే ఇప్పుడు ఉత్కంఠగా మారింది.


