మంత్రుల సభలో రసాభాస..!
ద్వితీయ శ్రేణి కాంగ్రెస్ నాయకుల మధ్య విభేదాలు
గోదావరిఖనిలో వేదికపైనే తోపులాట
కాకతీయ, పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన అభివృద్ధి పనుల ప్రారంభం, ఇందిరమ్మ పట్టాల పంపిణీ సభలో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండ సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్న ఈ సభలో ద్వితీయ శ్రేణి కాంగ్రెస్ నాయకుల మధ్య విభేదాలు బహిరంగమయ్యాయి. మంత్రుల ప్రసంగాలు ముగిసి వారు వేదిక దిగిన అనంతరం స్టేజీపై ఉన్న ఇద్దరు కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని చివరకు తోపులాటకు దారితీసింది. ఇందిరమ్మ పట్టాల పంపిణీ అంశమే వివాదానికి కారణమని సమాచారం. ఒకే డివిజన్‌కు చెందిన నాయకుల మధ్య నెలకొన్న పాత విభేదాలు ఈ సమావేశంలో బహిరంగంగా బయటపడినట్లు తెలుస్తోంది.
వేదికపైనే పరస్పరం పిడిగుద్దులు గుద్దుకోవడం పార్టీ శ్రేణుల్లోనే కాక ప్రజల్లోనూ విస్తృత చర్చకు దారితీసింది. మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరైన సభలో ఇలాంటి ప్రవర్తన సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది పార్టీ ప్రతిష్ఠకు దెబ్బతీసేదేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ ఘటనపై పార్టీ అధిష్టానం, జిల్లా నాయకత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.


