కో – ఆప్షన్ పదవులపై మాజీల్లో ఉత్కంఠ
పొత్తు ధర్మాన్ని పాటిస్తూ పదవులు వర్తిస్తాయా..?
నాలుగు పదవులు ఎవరికి దక్కనున్నాయి..?
కాకతీయ, రామకృష్ణాపూర్ : మొన్నటి వరకు చైర్ పర్సన్,వైస్ చైర్ పర్సన్ ఎన్నిక కోసం కలిసి పోరాటం చేసిన బీఆర్ఎస్ & సీపీఐ పార్టీలు ఎట్టకేలకు రెండు కుర్చీలను కైవసం చేసుకున్నాయి. ఎన్నో వివాదాల నడుమ వాయిదా పడిన ఎన్నికను హై కోర్ట్ ఆదేశాల మేరకు ఏప్రిల్ నాలుగో తేదీన నిర్వహించిన అధికారులు చైర్ పర్సన్,వైస్ చైర్ పర్సన్ లను అధికారికంగా ప్రకటించారు. అయితే మున్సిపాలిటీలో నూతనంగా కొలువు దీరిన పాలక వర్గానికి సరిపడ కో ఆప్షన్ పదవులు ఇంకా ప్రకటించాల్సి ఉంది. అయితే ఆ నాలుగు కో ఆప్షన్ పదవులు ఇప్పుడు ఎవరెవరికి వరిస్తాయి అనేది కాస్త ఆలోచించాల్సిన అంశంగానే భావిస్తున్నాయి ఆ రెండు పార్టీలు. ప్రస్తతం పార్టీ సీనియర్ నేతల్లో,మాజీ కౌన్సిలర్లలో కో ఆప్షన్ పదవులపై మరింత ఉత్కంఠ నెలకొంది. ఎలాగైనా ఆ పదవులను దక్కించుకోవాలని కుతూహలం రెండు పార్టీలకు చెందిన నేతల్లో బలంగా నాటుకుంది. ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన బీఆర్ఎస్ & సీపీఐ పార్టీలకు పదవులు వరిస్తాయనేది పార్టీ నేతల్లో జోరుగా చర్చ నడుస్తుంది. అయితే ఆ రెండు పార్టీలకు చెందిన ముఖ్యనేతలు మాత్రం ఆ పదవులపై ఇప్పటివరకు ఇంకా ఒప్పందానికి రానట్లు తెలుస్తుంది.
“మాజీ కౌన్సిలర్ల చూపు కో – ఆప్షన్ వైపు”
మొన్నటి వరకు ఎన్నికల్లో పోటీ చేసిన తమ వార్డు అభ్యర్థులను గెలిపించుకునేందుకు తెగ కష్టపడ్డ మాజీ నేతల కన్ను కో – ఆప్షన్ పదవులపై పడింది. రిజర్వేషన్లు అనుకూలంగా రాకపోవడంతో బరిలో నిలిచిన అభ్యర్థుల గెలుపుకు కృషి చేసిన మాజీ కౌన్సిలర్ల చూపు ఇప్పుడు కో ఆప్షన్ పదవుల వైపు మారింది. వాస్తవంగా ఎన్నికల్లో బీఆర్ఎస్ & సీపీఐ పొత్తు పెట్టుకున్న క్రమంలో వైస్ చైర్ పర్సన్ తో పాటు ఒక కో ఆప్షన్ పదవి సీపీఐ పార్టీకి ఇస్తారనుకున్నారు. ప్రస్తతం మిత్ర పక్షం సీపీఐ మాత్రం రెండు కో ఆప్షన్ పదవులను బీఆర్ఎస్ పార్టీని అడుగుతున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఇప్పటికే ఆ నాలుగు పదవులలో మూడింటిపై బీఆర్ఎస్ మాజీ సిట్టింగ్ కౌన్సిలర్లు తెగ ఆశలు పెట్టుకున్నారు. ఆ మూడు పదవులపై దృష్టి పెట్టిన వారికి 1,4,5,8,9,13,14,17,18,20 వార్డులకు చెందిన మాజీ కౌన్సిలర్లు ఉన్నారు. చూడాలి మరి ఆ నాలుగు కో ఆప్షన్ పదవులు ఎవరికి దక్కుతాయో. మరో వారం లోపే కో ఆప్షన్ సంబధించిన ప్రత్యేక సర్క్యులర్ మున్సిపల్ అధికారులకు వచ్చే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు తెలుస్తుంది.


