గూడుంబా నిర్మూలనకు ఎక్సైజ్ ఆకస్మిక దాడులు
కాకతీయ, నల్లబెల్లి : నాటు సారా నిర్మూలన లక్ష్యంగా నర్సంపేట ఎక్సైజ్ సీఐ ఆధ్వర్యంలో నల్లబెల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఆకస్మిక దాడులు నిర్వహించారు. మండల పరిధిలోని నందిగామ, రేలకుంట, లెంకాలపల్లి గ్రామాల్లో జిల్లా టాస్క్‌ఫోర్స్, స్టేట్ టాస్క్‌ఫోర్స్ సిబ్బందితో కలిసి విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో అక్రమంగా నాటు సారా తయారీకి ఉపయోగిస్తున్న సుమారు 800 లీటర్ల చక్కెర పానకాన్ని ధ్వంసం చేసి, 15 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. నాటు సారా తయారీ, విక్రయాలకు పాల్పడిన నలుగురు వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. నాటు సారా తయారీ, విక్రయాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని, అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఎక్సైజ్ సీఐ నరేష్ రెడ్డి, జిల్లా టాస్క్‌ఫోర్స్ సీఐ రమేష్ చందర్, స్టేట్ టాస్క్‌ఫోర్స్ సీఐ నాగరాజు, ట్రైనీ ఎస్సై సురేష్ రెడ్డి తదితర సిబ్బంది పాల్గొన్నారు.


