మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం
కలెక్టర్ రాహుల్ శర్మ
కాకతీయ, భూపాలపల్లి : జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఈ నెల 27న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్ నిర్వహించి, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతామని వెల్లడించారు. కాటారం, మల్హర్, మహదేవపూర్, మహాముత్తారం మండలాల్లో మొత్తం 81 గ్రామ పంచాయతీలకు 696 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, 98,052 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మూడో విడతలో 3 గ్రామ పంచాయతీలు, 126 వార్డులు ఏకగ్రీవమయ్యాయని తెలిపారు. పోలింగ్ నిర్వహణకు 1,887 మంది సిబ్బందితో పాటు జోనల్, రూట్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లను నియమించామని చెప్పారు. సున్నితమైన కేంద్రాల్లో 35 చోట్ల వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేయగా, శాంతిభద్రతల దృష్ట్యా 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛాయుతంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.


