మేడారం జాతరకు సర్వం సిద్ధం
గిరిజన సంప్రదాయాలకు పెద్దపీట
3 కోట్ల మంది భక్తుల రాక అంచనా
సీఎం చేతుల మీదుగా వనదేవతల గద్దెల పునఃప్రారంభం
సిఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు
కాకతీయ, ములుగు ప్రతినిధి : గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరను నిర్వహించాలని, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేకతను చాటిచెప్పే విధంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా వనదేవతల గద్దెల పునఃప్రారంభం చేయనున్నట్లు సిఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.ఎస్. శ్రీనివాస రాజు తెలిపారు. గురువారం ఎస్.ఎస్. తాడ్వాయి మండలం మేడారం ఐటీడీఏ గెస్ట్ హౌస్‌లో ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు, జిల్లా కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్, ఐటీడీఏ పీవో చిత్ర మిశ్రా, డీఎఫ్‌వో రాహుల్ కిషన్ జాదవ్లతో కలిసి జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
జనవరి 28 నుంచి జాతర
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర మాట్లాడుతూ, మేడారం జాతర జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. 28వ తేదీ సాయంత్రం 6 గంటలకు కన్నెపల్లి నుంచి సారలమ్మను, కొండాయి నుంచి గోవింద రాజును, పునుగొండ్ల నుంచి పగిడిద్ద రాజును గద్దెపైకి తీసుకురావడంతో జాతర ప్రారంభమవుతుందని చెప్పారు. 29వ తేదీ సాయంత్రం 6 గంటలకు చిలకలగుట్ట నుంచి సమ్మక్క దేవతను గద్దెపైకి తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. 30వ తేదీన భక్తులు వనదేవతలకు మొక్కులు చెల్లిస్తారని, 31వ తేదీ సాయంత్రం 6 గంటలకు సమ్మక్క, సారలమ్మ, గోవింద రాజు, పగిడిద్ద రాజు వనదేవతలు వనప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుందని వివరించారు. మేడారం జాతరకు సుమారు 3 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, జాతర పరిసరాలను 8 జోన్లుగా విభజించి, ప్రతి జోన్‌లో 8 మంది అధికారులను నియమించినట్లు తెలిపారు. మొత్తం 42 పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసినట్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
రహదారులు–సిగ్నల్ ఏర్పాట్లు
భక్తులకు సెల్‌ఫోన్ సిగ్నల్ సమస్యలు తలెత్తకుండా 60 శాశ్వత సెల్ టవర్లు ఏర్పాటు చేసి కాల్ డ్రాప్, వీక్ సిగ్నల్ సమస్యలను నివారించేలా ప్రణాళికలు రూపొందించినట్లు కలెక్టర్ తెలిపారు. రహదారుల విషయానికి వస్తే, 39 పాత రహదారులు, 10 కొత్త రహదారుల్లో మొత్తం 525 సమస్యలను పరిష్కరించామని వెల్లడించారు. పార్కింగ్ కోసం అటవీ శాఖ పరిధిలో 235 ఎకరాలు, పట్టా భూములు 250 ఎకరాలు, ప్రభుత్వ భూమి 3 ఎకరాలు గుర్తించి, వాటి నిర్వహణ బాధ్యతలను అటవీ, గిరిజన సంక్షేమ శాఖలకు అప్పగించినట్లు తెలిపారు. వీఐపీ వాహనాలు, ఆర్టీసీ బస్సులు పసర–తాడ్వాయి మార్గం ద్వారా మేడారానికి చేరుకుంటాయని, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలు కాటారం–కల్వపల్లి మార్గం, హైదరాబాద్–వరంగల్ నుంచి వచ్చే ప్రైవేట్ వాహనాలు పసర మార్గం ద్వారా చేరుకుంటాయని ఎస్పీ వివరించారు.
శాఖల సమన్వయం అవసరం
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు మాట్లాడుతూ, రహదారులు, పార్కింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు పార్కింగ్‌కు సంబంధించిన సమాచారం సులభంగా అందుబాటులో ఉండేందుకు ప్రత్యేక మొబైల్ యాప్ అభివృద్ధి చేయాలని సూచించారు. జాతర సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో ఆర్డీఓ వెంకటేష్, ఈఈ వీరస్వామి, నేషనల్ హైవే, ఆర్&బీ, పీఆర్, ట్రైబల్ వెల్ఫేర్, ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యూఎస్, డీపీఓ, ఎండోమెంట్, విద్యుత్, డీఎం అండ్ హెచ్‌ఓ, ఫైర్, ఎక్సైజ్, ఫిషరీస్, టూరిజం, డీడబ్ల్యూఓ, డీవీహెచ్‌ఓ, ఐటీడీఏ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.


