సీపీఐ శతాబ్ది సభకు సర్వం సిద్ధం
ఎరుపు మయంగా మారిన ఖమ్మం జిల్లా కేంద్రం
ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ మైదానంలో బహిరంగ సభ
నేడు లక్షల మందిని సభకు తరలించేందుకు యత్నం
బహిరంగ సభకు హాజరుకానున్న జాతీయ నేతలు, వివిధ దేశాల ప్రతినిధులు
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) శతాబ్ది ఉత్సవాల ముగింపు బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. జనవరి 18న ఆదివారం ఖమ్మంలో లక్షలాది మందితో జరిగే ఈ ప్రతిష్ఠాత్మక సభకు ఆహ్వాన సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో జరగనున్న సభను జిల్లాలో ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ నిర్వహించని స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. 60 అడుగుల భారీ డిజిటల్ వేదికను సిద్ధం చేయగా, సుదూర ప్రాంతాల నుంచీ స్పష్టంగా కనిపించేలా సాంకేతిక సదుపాయాలు కల్పించారు. మైదానం అంతటా విద్యుత్ దీపాలు అమర్చారు. 40 వేల మందికి పైగా కూర్చునేలా కుర్చీలను ఏర్పాటు చేశారు. జనసేవాదళ్ మహిళలు, కేంద్ర నాయకత్వానికి ముందు భాగంలో ప్రత్యేక స్థలాలు కేటాయించారు. ఖమ్మం నగరం మొత్తం ఎర్ర జెండాలు, తోరణాలు, ఫ్లెక్సీలతో అలంకరించారు. ప్రదర్శనలకు వచ్చే వారికి దారి పొడవునా తాగునీటి సౌకర్యం కల్పించారు.

మూడు వైపుల నుంచి ప్రదర్శనలు
సిపిఐ శతాబ్ది సభ సందర్భంగా ఖమ్మంలో మూడు వైపుల నుంచి భారీ ప్రదర్శనలు రానున్నాయి. మొదటి ప్రదర్శన పెవిలియన్ మైదానం నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన జనసేవాదళ్ కార్యకర్తల కవాతు, కళాకారుల ప్రదర్శనలు, బంజారా–కోయ నృత్యాలు, డప్పు దళాలు, వృత్తి సంఘాల ప్రదర్శనలు ఉంటాయి. ఈ ప్రదర్శనకు బాగం హేమంతరావు నేతృత్వం వహిస్తారు. రెండో ప్రదర్శన శ్రీశ్రీ విగ్రహం వద్ద నుంచి వైరా రోడ్డు మీదుగా సాగుతుంది. వాహనాల ద్వారా వచ్చిన ప్రజలు ఇందులో పాల్గొంటారు. ఈ ప్రదర్శనకు డి. రాజా, కూనంనేని సాంబశివరావు, ఎస్కే సాబీర్ పాషా, జమ్ముల జితేందర్‌రెడ్డి నేతృత్వం వహించనున్నారు. మూడో ప్రదర్శన ఖమ్మం నయాబజార్ కళాశాల నుంచి ప్రారంభమవుతుంది. ఉమ్మడి వరంగల్, నల్లగొండ, పాలేరు నియోజకవర్గాలతో పాటు రైళ్ల ద్వారా వచ్చిన కార్యకర్తలు ఇందులో పాల్గొంటారు.

కేంద్ర నాయకత్వం హాజరు
బహిరంగ సభకు సిపిఐ కేంద్ర కౌన్సిల్, కార్యవర్గ, కార్యదర్శి వర్గ సభ్యులు హాజరుకానున్నారు. జాతీయ నాయకులు డి. రాజా, అమర్జిత్ కౌర్, బీకే టాంగో, రామకృష్ణ పాండా, అనిరాజా, గిరిశర్మ, కె. ప్రకాష్‌బాబు, సంతోష్‌కుమార్, సంజయ్‌కుమార్, పల్లా వెంకటరెడ్డి, కె. రామకృష్ణ తదితరులు పాల్గొననున్నారు. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రదర్శనలు ప్రారంభమై, మూడు గంటలకు సభా స్థలానికి చేరుకుంటాయి. ఈ బహిరంగ సభకు సిపిఐ జాతీయ కార్యదర్శి డి. రాజాతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.




