కాంగ్రెస్ పాలనలో కరెంటు నుండి కాంట దాకా అన్నీ సమస్యలే
సీఎం రేవంత్ రెడ్డి సర్కారుపై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు
వరంగల్ రైతు డిక్లరేషన్ ను కాంగ్రెస్ విస్మరించిందని ధ్వజం
రైతులను అరిగోస పెట్టుకుంటున్నారని మండిపాటు
పంట ఉత్పత్తులపై సుంకాల విధింపుతో తీరని నష్టం
రైతులకు అండగా బీఆర్ఎస్ ఉంటుందని స్పష్టం
వరంగల్ ఏనుమాముల మార్కెట్ ను సందర్శించిన హరీశ్ రావు
పత్తి చేనును సందర్శించి, రైతుల గోడు విన్న మాజీ మంత్రి
కాకతీయ, వరంగల్: కాంగ్రెస్ పాలనలో రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ హామీలను నెరవేరడంలో విఫలమైందని ధ్వజమెత్తారు. మంగళవారం హరీశ్ రావు వరంగల్ లో పర్యటించారు. ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ ను సందర్శించారు. రైతులతో మాట్లాడారు. వారి ఇబ్బందులను తెలుసుకున్నారు.


అనంతరం హరీశ్ రావు విలేకరులతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి సర్కారు తీరును ఎండగట్టారు. ఎరువులందవు, విత్తనాలు అందవు, కరెంటు సరిగ్గా రాదు. రైతుబంధు రాదు. రుణమాఫీ జరగదు. బోనస్ ఎగ బెడతావు. పంటల బీమా లేదు. ఇంతే కదా రేవంత్ రెడ్డి, వరంగల్ డిక్లరేషన్ లో చెప్పిన ఒక్క హామీ అయిన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందా? అని ప్రశ్నించారు. దిగుమతి సుంకాలు ఎత్తివేసి బీజేపీ కేంద్ర ప్రభుత్వం రైతులపై ఆంక్షలు పెట్టడం సరికాదన్నారు. పత్తి, పామాయిల్ దిగుమతులపై సుంకం ఎత్తేసి ఎవరికి లాభం చేస్తున్నారు? ఎందుకు రైతుల మెడకు ఉరితాడు బిగిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. బడా కాంట్రాక్టర్లకు, కార్పొరేట్లకు లాభం చేసేందుకు రైతులను అన్యాయం చేస్తుందని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దేశంలో మొట్టమొదటిసారి రైతులకు రైతుబంధు తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి మేలుకోకపోతే తెల్ల బంగారం తెచ్చి జూబ్లీహిల్స్ ప్యాలెస్ ముందు పోస్తామని హెచ్చరించారు.

రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాన్ని ఉదృతం చేస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలో పత్తి రైతులు తీవ్రమైన మనోవేదనకు గురవుతున్నారు. రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, బీజేపీ తప్పుడు విధానాల వల్ల పత్తి రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. సీసీఐ తుగ్లక్ వంటి పిచ్చి నిర్ణయాలు తీసుకొని రైతులను ఇబ్బందుల గురి చేస్తున్నది. కపాస్ యాప్ లో 8 నుండి 12 శాతం తేమ ఉండాలనే తుగ్లక్ నిర్ణయాలతో రైతులు రోడ్ల మీద పడే పరిస్థితి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా జిన్నింగ్ మిల్లులన్నీ రెండు రోజులుగా మూతపడ్డాయి. పత్తి రైతులంతా అయోమయంలో ఉన్నారు. ఈరోజు రైతులకు పత్తిని అమ్ముకోవడానికి అవకాశం లేక అడ్డగోలుగా దళారులకు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. 8,100 రూపాయలు పత్తికి మద్దతు ధర కానీ 6వేలకే రైతులు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. క్వింటాల్ మీద 2వేలు పత్తి రైతుల నష్టపోతున్నారు. మాటల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అర చేతిలో వైకుంఠం చూపించి చేతల్లో నరకం చూపిస్తున్నారు. వరదల వల్ల, తుఫాన్ ల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతుంటే తుగ్లక్ నిర్ణయాలతో మరింత ఇబ్బంది పెట్టడం సరికాదు. 60 సార్లు ఢిల్లీకి పోయిన ముఖ్యమంత్రికి పత్తి రైతుల గురించి కేంద్రానికి విన్నవించే అవకాశం రాలేదా? ముఖ్యమంత్రికి పత్తి రైతుల సమస్యలు కేంద్రానికి చెప్పే ఓపిక లేదా? సమయం లేదా?రేవంత్ రెడ్డికి బడేభాయితో మంచి సంబంధాలే ఉన్నాయి కదా. ఎందుకని పత్తి రైతుల గురించి బడే భాయికి చెప్పడం లేదు. ఉప ఎన్నికల్లో గెలవడానికి విచ్చలవిడిగా డబ్బులు పంచిన రేవంత్ రెడ్డి పత్తి రైతులకు కనీస మద్దతు ధర అందించలేకపోతున్నారు. ఒకవైపు అకాల వర్షాలతో పంట దిగుబడి తగ్గిపోయింది. వంట చేసులన్నీ దెబ్బతిన్నాయి. పెట్టిన పెట్టుబడులు రాక రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది.
ఎల్ వన్, ఎల్ టు, ఎల్ త్రీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
8 నుంచి 12 శాతం తేమ విధానాన్ని సవరించండి, కపాస్ యాప్ ను రద్దు చేయండి. స్మార్ట్ ఫోన్లు లేకపోవడం వల్ల కపాన్ యాప్ లో నమోదు చేయడం రైతులకు కష్టమైన పని. గత సంవత్సరం లాగానే 12 క్వింటాల పత్తి కొనాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచి ఏం చేస్తున్నారు?
పంట పొలాల్లో ఉండే దిష్టిబొమ్మలు బీజేపీ ఎంపీల కంటే నయం. దిష్టిబొమ్మలు పంట పొలాల్లో కోతులు, పక్షులు రాకుండా కనీసం పనిచేస్తాయి. బీజేపీ ఎంపీలు ఒక్కసారి కూడా నోరు విప్పురు. రైతుల గురించి కేంద్ర ప్రభుత్వాన్ని అడగరు. కేసీఆర్ ని తిట్టుడు బీఆర్ఎస్ ని తిట్టడం తప్ప మరో పని చాతకాదు బీజేపీ ఎంపీలకు.
కాంగ్రెస్ ప్రశ్నించదు. బీజేపీ అడగదు. బడా బడా పారిశ్రామికవేత్తలకు బీజేపీ లక్ష కోట్లు మాఫీ చేసింది.
మరి పేద రైతులకు ఎందుకు మేలు చేయరు? విదేశాల నుంచి పత్తి దిగుమతి ని చేసుకుంటే నిబంధనలు సవరించి 11శాతం ఉన్న దిగుమతి సుంకాన్ని రద్దుచేసి విచ్చలవిడిగా పత్తిని తెస్తున్నారు. కనీస మద్దతు ధరకు పత్తి అమ్ముకోలేని పరిస్థితి రైతులకు ఏర్పడింది. ఏమైనా అడుగుతే మోడీ గారి ప్రభుత్వం విదేశాల నుండి పత్తి దిగుమతి చేసుకుంటుందని సమాధానం చెబుతున్నారు. రైతుకు మేలు చేసేది ఉంటేనే నిబంధనలు పెడతారా? దళారుల కోసం, బదా బాబుల కోసం ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో 406 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రైతులపై లాఠీచార్జులు రేవంత్ రెడ్డి పాలనలో పెరిగాయి.
రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనా విజయోత్సవాలు జరుపుతున్నారు. ఎందుకు రేవంత్ రెడ్డి గారు? రైతులను తీవ్రంగా ఇబ్బందులు పెట్టినందుకు విజయోత్సవాలు చేస్తున్నారా? యూరియా బస్తాల కోసం రైతులను లైన్లో నిల్చోపెట్టినందుకు విజయోత్సవాలా? ములుగు నియోజకవర్గంలో చింతకుంట, మంగపేట మండలాల నుంచి వచ్చిన రైతు వెంకటేశ్వర్లు, రైతు లక్ష్మయ్య ముక్కలు అమ్మడానికి ఎనుమాముల మార్కెట్ కి వచ్చారు. క్వింటల్ మక్కలు 1800 రూపాయలకు రైతులు అమ్ముతున్నారు. 2400 మక్కకు మద్దతు ధర, మక్క రైతులు ఒక క్వింటాలకు 570 రూపాయలు నష్టపోతున్నారు. ఎవరికైనా మక్క రైతులకు పైసలు విడుదల చేశారా అని మార్క్ ఫెడ్ అధికారులను అడుగుతే.. రాష్ట్ర ప్రభుత్వం ఒక రూపాయి కూడా మక్క రైతులకు విడుదల చేయలేదని సమాధానం ఇచ్చారు. పోయిన యాసంగిలో రైతులకు రావలసిన 1,100 కోట్ల బోసన్ ని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఈ సంవత్సరం కొన్న రైతులకు కూడా 1,400 కోట్ల బకాయిలు పడ్డాయి. పంటల భీమా తెస్తామన్న కాంగ్రెస్ పార్టీ రెండేళ్లు అయినా పంటల బీమాను రైతులకు అందించడంలో విఫలమైంది. పంటల బీమా ఉండి ఉంటే నష్టపోయిన పంటకు రైతులకు నష్టపరిహారాలు అందేది కదా. బోనస్ ఎగ్గొడీతివి, రైతుబంధు రెండు పంటలకు ఎగబెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కరెంటు నుండీ కాంట దాకా అన్నీ సమస్యలే. కరెంటు లోవోల్టేజ్ వల్ల ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. కాంటాకు వస్తే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరవక, తెరిచినా కొనక దళారుల పాలైతున్నది ధాన్యం. ఢిల్లీకి పోయి ప్రధానమంత్రిని కలిసి నిబంధనలు ఎత్తివేసి పత్తికొనే విధంగా చేయాలని డిమాండ్ చేస్తున్నా, వరంగల్ వరదల్లో 20,000 ఇండ్లు మునిగిపోయాయి. సకాలంలో గేట్లు ఎత్తి ఉంటే వరంగల్ నగరం ముగిపోయేది కాదు. మునిగిపోయిన ఇళ్లకు 15,000 ఇస్తామన్నారు. రెండు నెలలు అయింది కానీ ఒక రూపాయి ఇవ్వలేదు. వెంటనే నష్టపరిహారం విడుదల చేయాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం..’ అని హరీశ్ రావు పేర్కొన్నారు.పత్తి చేను సందర్శించిన మాజీ మంత్రి మార్కెట్ నుండి బయటకువచ్చిన హరీశ్ రావు అక్కడికి సమీపంలో ఉన్న రెడ్డిపాలెం, మొగిలిచర్ల మధ్యలో ఉన్న పత్తి చెను లోకి వెళ్లారు. పత్తి ఏరుతున్న రైతులు, కూలీలులతో మాట్లాడారు. ఎరువుల సకాలంలో అందక, అకాల వర్షాలతో దిగుబడి తగ్గిందని రైతు పేర్కొన్నారు. పండిన పత్తికి ధర కూడా సరిగా లేదని వాపోయారు. ప్రభుత్వం 8100 ధర నిర్ణయిస్తే.. తేమ సాకుతో 4వేలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన చెందారు.


