ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి
పోలింగ్ కేంద్రాల్లో పూర్తిస్థాయి ఏర్పాట్లు
ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి
ములుగు జిల్లా కలెక్టర్ దివాకర
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు మున్సిపాలిటీ పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ విలువైన ఓటును తప్పకుండా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర పిలుపునిచ్చారు. మంగళవారం ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన బ్యాలెట్ పత్రాల పంపిణీ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఎన్నికల సామగ్రిని చెక్‌లిస్ట్ ప్రకారం సరిచూసుకోవాలని పోలింగ్ సిబ్బందికి సూచించారు. ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలన్నారు. ములుగు మున్సిపాలిటీలో 20 వార్డులకు గాను 83 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, 13,500 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్‌కాస్టింగ్ కెమెరాలు ఏర్పాటు చేశామని, పోలింగ్ అనంతరం బ్యాలెట్ పత్రాల భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. ప్రశాంత పోలింగ్‌కు ఓటర్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కలెక్టర్ కోరారు.


