గ్రామాభివృద్ధికి అందరూ తోడ్పడాలి
రేగళ్ల పెద్దతండా సర్పంచ్ లావుడ్య పూర్ణ
పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలపై చర్చ
కాకతీయ, కొత్తగూడెం : గ్రామాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రేగళ్ల పెద్దతండా సర్పంచ్ లావుడ్య పూర్ణ కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల పెద్దతండా గ్రామపంచాయతీలో గురువారం సర్పంచ్ ఆధ్వర్యంలో సాధారణ గ్రామసభ నిర్వహించారు. గ్రామసభలో గ్రామంలోని పారిశుద్ధ్యం, వీధి దీపాలు, తాగునీటి సమస్యలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారంపై సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ లావుడ్య పూర్ణ మాట్లాడుతూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. వీధి దీపాలు సక్రమంగా వెలిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తాగునీటి సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తామని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధి కోసం ప్రజల సహకారం ఎంతో అవసరమని, అందరూ కలిసి పనిచేస్తే గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దవచ్చని సర్పంచ్ అన్నారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ గ్రామసభలో పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళా సంఘాల సభ్యులు, యువకులు, గ్రామ ప్రజలు పాల్గొని తమ సమస్యలు, సూచనలు వెల్లడించారు.


