
- కాంట్రాక్టు వర్క్ కోసం తాపత్రయం అవసరం లేదు.
- మేడారం జాతర అభివృద్ధికి రూ. 251 కోట్లతో భారీ ప్రణాళిక.
- సీతక్క, సురేఖ అక్కలతో కలిసి ముందుకు తీసుకెళ్తాం.
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

కాకతీయ, ములుగు ప్రతినిధి: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర అభివృద్ధి కార్యక్రమాలపై వివాదాలు చెలరేగుతున్న తరుణంలో, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార,పౌరసంబంధాల శాఖ మంత్రి, వరంగల్ ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. నేనేంటో అందరికీ తెలుసు అని, 70 కోట్ల కాంట్రాక్టు వర్క్ కోసం నాకు తాపత్రయం అవసరం లేదు అని, నాపై సహచర మంత్రులు ఫిర్యాదు చేశారంటే నమ్మడం లేదు అని, ఫిర్యాదు చేసే ఛాన్సే లేదు అని ఆయన స్పష్టం చేశారు. సోమవారం ములుగు జిల్లా మేడారంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్కతో కలిసి సమ్మక్క–సారలమ్మ ఆలయాభివృద్ధి పనుల ప్రగతిని ఆయన సమీక్షించారు. అధికారులతో కలిసి వివిధ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు.
రూ. 251 కోట్లతో అభివృద్ధి పనులు

మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం పర్యటన సందర్భంగా రూ.101 కోట్లను మంజూరు చేశారు అని, వాటిలో రూ.71 కోట్లకు ఇప్పటికే టెండర్లు పిలిచాం అని, గడచిన సంవత్సరాల్లో మంజూరైన రూ.150 కోట్లతో కలిపి మొత్తం రూ.251 కోట్ల విలువైన అభివృద్ధి పనులు దశలవారీగా కొనసాగుతున్నాయి అని తెలిపారు. ఈ అభివృద్ధి పనులు శాశ్వత ప్రాతిపదికన జరుగుతాయని, భవిష్యత్తులో ప్రతి జాతరలో ఉపయోగపడే విధంగా రహదారులు, పార్కింగ్, డ్రైనేజ్, మంటపాలు, సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. మేడారం జాతరకు వచ్చే నిధులు జంపన్న వాగులో వర్షపు నీటిలా జారిపోకుండా, ప్రతి రూపాయి జాతర ప్రాంగణాల అభివృద్ధికే వినియోగిస్తాం అని ఆయన హామీ ఇచ్చారు.
అభివృద్ధి పనులు వేగవంతం

మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఇంకా 50 రోజుల్లో ఈ పనులన్నీ ఎటువంటి ఆటంకం లేకుండా సాగేలా జిల్లా కలెక్టర్, ఎస్పీలకు సూచనలు ఇచ్చాం అని, మంత్రివర్యురాలు సీతక్క స్వయంగా పర్యవేక్షణ చేస్తారు అని, ఎవరు సూచనలు, సలహాలు ఇచ్చినా వాటిని స్వీకరిస్తాం అని చెప్పారు. అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత భక్తుల సౌకర్యం గణనీయంగా పెరుగుతుందని తెలిపారు. గత జాతరలో కోటి మందికి పైగా భక్తులు పాల్గొన్నారని, ఈసారి ఆ సంఖ్య రెట్టింపు కానుందని మంత్రి పేర్కొన్నారు.
ఆరోపణలకు సమాధానమిస్తూ

మంత్రుల మధ్య టెండర్ల రగడ, ఫిర్యాదులపై వస్తున్న వార్తలపై స్పందిస్తూ పొంగులేటి స్పందించారు. నాపై ఎవరైనా ఫిర్యాదు చేశారంటే నేను నమ్మను అని, అలాంటి అవకాశం లేదనే నమ్మకం ఉంది అని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు మేము అభివృద్ధి పనులు చేపడుతున్నాం అని,సమ్మక్క–సారలమ్మల వంటి సీతక్క, సురేఖ అక్కలతో కలిసి ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాం అని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వం కట్టుబడి ఉంది

మేడారం జాతర అభివృద్ధి పట్ల ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రి పొంగులేటి పునరుద్ఘాటించారు. ఇది దేశంలో అతిపెద్ద ఆదివాసీ జాతర అని, దీని ప్రతిష్ఠను మరింతగా పెంచే దిశగా ప్రతి శాఖ సమన్వయంతో పని చేస్తోంది అని, మేడారం అభివృద్ధి ప్రణాళికలో సంస్కృతి, భక్తి, సదుపాయాలు అన్నీ సమపాళ్లలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం అని తెలిపారు.
సమావేశంలో ఎంపీ బలరాం నాయిక్, ఎమ్మెల్యేలు, అధికారులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


