దేశాన్ని రక్షించేందుకు ప్రతీ పౌరుడు సిద్ధంగా ఉండాలి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు పిలుపు
కార్గిల్ విజయ్ దివస్‌ను పురస్కరించుకుని బీజేపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
భారత మాజీ ఆర్మీ జవాన్లకు ఘన సన్మానం
కాకతీయ, రాజాపూర్(జూలై 26) : కార్గిల్ విజయ్ దివస్‌ను పురస్కరించుకుని జడ్చర్ల నియోజకవర్గంలోని రాజాపూర్ మండలంలో బిజెవైఎం ఆధ్వర్యంలో భారీ ర్యాలి నిర్వహించారు. ఈ ర్యాలి లో బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు పాల్గొన్నారు. అనంతరం భారత మాజీ ఆర్మీ జవాన్లను సన్మానించారు. ఈ సందర్భంగా రామచంద్ర రావు మాట్లాడుతూ దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన భారత వీర జవాన్ల త్యాగాలను స్మరించుకుంటూ, దేశ సేవలో, రక్షణ కోసం సేవలందించిన మాజీ ఆర్మీ జవాన్లను సత్కరించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానన్నారు.ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, జిల్లా అధ్యక్షులు అలాగే ప్రతి బిజెవైఎం కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లోరామచంద్ర రావు మాట్లాడుతూ దేశ రక్షణ కోసం వీరోచితంగా పోరాడి, తమ పరాక్రమంతో పాకిస్తాన్ కు ముచ్చెమటలు పట్టించి, కార్గిల్ యుద్ధంలో భారత్ విజయం సాధించేందుకు వీరమరణం పొందిన అమరవీర జవాన్లకు మా ఘన నివాళులు అర్పించారు.1999లో కార్గిల్ ప్రాంతం నుంచి పాకిస్తాన్ ఉగ్రవాదులు మరియు చొరబాటుదారులు భారతదేశంలోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. ఇది భారతదేశంపై పాకిస్తాన్ చేసిన ఘోరమైన కుట్ర.ఈ దాడిని భారత సైన్యం ధైర్యంగా ఎదుర్కొంది. అప్పటి ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలో భారత సైన్యం ఓ మహత్తర విజయాన్ని సాధించింది. శత్రువులను తిప్పికొట్టి, కార్గిల్ లోని భారత భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది. ఈ యుద్ధంలో మన సైనికులు ప్రాణత్యాగాలు చేశారు. వారి ధైర్యం, వీరత్వం ఎప్పటికీ మరువలేనివి.ఈ రోజు దేశవ్యాప్తంగా కార్గిల్ విజయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ మరియు భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమాల ద్వారా ప్రజలకు మళ్లీ ఒకసారి భారత వీరజవాన్ల త్యాగాలను గుర్తు చేసుకుంటున్నాం. ఈ వేళ, చిన్నపిల్లలు కూడా పాల్గొంటూ దేశభక్తిని వ్యక్తపరుస్తున్నారు.భారత సైన్యం చేసిన త్యాగానికి గుర్తుగా, మనం జరుపుకుంటున్న కార్గిల్ విజయ దినోత్సవం భారత సైనిక వీరత్వానికి నిదర్శనం. ఇటీవల జరిగిన సర్జికల్ స్ట్రైక్‌లు, వైమానిక దాడులు, ఇతర ఆపరేషన్‌లు— ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికే.పాకిస్తాన్ మళ్లీ మామూలుగా దాడి చేయగలిగే స్థితిలో లేదు. కానీ పరోక్షంగా ఉగ్రవాదుల ద్వారా భారత్‌పై దాడులు చేస్తున్నాయి. కానీ ఈ దేశం ఇప్పుడు మారిపోయింది. సైనికులే కాదు..ఈ దేశపు ప్రతి యువకుడు, ప్రతి పౌరుడు దేశాన్ని రక్షించేందుకు సిద్ధంగా ఉన్నారు.ఈ కార్గిల్ విజయ దినోత్సవం మన యువతలో ఉత్సాహాన్ని, జాతీయతను పెంపొందించే అవకాశంగా ఉండాలన్నారు.


