- ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, భగవద్గీత ప్రచారకులు రాధా మనోహర్ దాస్
- ములుగులో వైభవంగా రావణ వధ
కాకతీయ, ములుగు ప్రతినిధి: భారతీయ మూలాలను మర్చిపోతే భవిష్యత్ ఉండదని, యుగాలు మారినా సనాతన ధర్మం శాశ్వతమని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, భగవద్గీత ప్రచారకులు రాధా మనోహర్ దాస్ స్వామీజీ అన్నారు. భారతదేశంతోపాటు సర్వమతాలను ప్రతీ ఒక్కరూ గౌరవించాలని పిలుపునిచ్చారు. ధర్మజాగరణ ఉత్సవ సమితి అధ్యక్షుడు గండ్రకోట కుమార్ ఆధ్వర్యంలో విజయదశమిని పురస్కరించుకొని గురువారం నిర్వహించిన రావణాసురవధ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కూచిపూడి నృత్యాలు, జానపద గీతాలు, దేశభక్తి, సినీగీతాలు, మిమిక్రీతో ప్రదర్శనలు అలరించాయి.
ఈ కార్యక్రమానికి రాధామనోహర్ హాజరై మాట్లాడారు. చెడుపై మంచి సాధించిన విజయానికి, పది దుర్గుణాలను మనలో నుంచి పారదోలడానికి రావణాసురవధ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. దేశం, ధర్మం కోసం యువత పాటుపడాలని, దేశ ఔన్నత్యాన్ని దెబ్బతీసేవారిని వదిలేదన్నారు. ప్రపంచంలోనే భారతదేశాన్ని గొప్పస్థానంలో నిలబెట్టిన మహనీయులను నిర్మాణం చేసిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) వందేళ్ల పండుగను జరుపుకుటోందని తెలిపారు. స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలని, విమర్శలు చేసే విదేశీయులకు భారత ఖ్యాతి, ఐక్యతను చాటాలని సూచించారు.
భారతదేశంలో సెక్యులరిజం అనే పదం కేవలం ఒక వర్గానికి మాత్రమే అమలు అవుతోందని విచారం వ్యక్తం చేశారు. ములుగు సీనియర్ సివిల్ జడ్జి కన్నయ్యలాల్ మాట్లాడుతూ.. ములుగు జిల్లా కేంద్రంలో దసరా సందర్భంగా నిర్వహించిన రావణాసురవధ విశేషంగా ఆకట్టుకుందని, పండుగపూట ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వేలాదిమంది కుటుంబాలను ఒకేచోట చేర్చి పండుగ జరుపుకోవడం సంతోషకరమని అన్నారు. ధర్మం కోసం చేసే కార్యక్రమాల్లో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మంచి కోసం చేసే ప్రతీ పనిలో తాను పాలుపంచుకుంటానని అన్నారు. కార్యక్రమంలో స్వాగత నిర్మాణ సమితి సభ్యులు కన్నోజు సునీల్, చెలుమల్ల రాజేందర్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాదం ప్రవీణ్, సుంకరి రవీందర్, గంగిశెట్టి శ్రీనివాస్, పెట్టెం రాజు, ఇమ్మడి రమేష్, వాంకుడోతు జ్యోతి, కర్ర రాజేందర్ రెడ్డి, కొత్తపల్లి బాబురావు, కొమరవెళ్లి హరినాథ్, గండ్రకోట రవీందర్, సానికొమ్ము వినీత్ రెడ్డి, తోకల నందన్ తదితరులు పాల్గొన్నారు.


