కాళ్లు మొక్కినా యూరియా లేదు!
▪ పంటల కీలక దశలో ఎరువు కొరత
▪ ‘బాంచన్’ అంటూ వేడుకున్న రైతులు
▪ డోర్నకల్‌లో రైతుల దయనీయ స్థితి
▪ స్పందించని అధికారులు
కాకతీయ, డోర్నకల్ : యూరియా ఎరువు కొరత డోర్నకల్ నియోజకవర్గం నర్సింహులపేట మండలం బస్తారాంతండా రైతులను తీవ్రంగా వేధిస్తోంది. పంటలు కీలక దశలో ఉన్న సమయంలో ఒక్క బస్తా యూరియా కోసం రైతులు అధికారుల చుట్టూ తిరుగుతూ చివరకు కాళ్లమీద పడే పరిస్థితి నెలకొంది.
ప్రభుత్వం గోదాముల్లో సరిపడా నిల్వలు ఉన్నాయని చెబుతున్నా, గ్రామస్థాయిలో మాత్రం యూరియా కనిపించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి, మిర్చి తదితర పంటలకు ఇప్పుడే ఎరువు అవసరం ఉన్నా సరఫరా లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని వాపోతున్నారు.
దిగుబడులపై భయం
సకాలంలో యూరియా అందకపోతే దిగుబడులు భారీగా తగ్గే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పెట్టుబడులు పెరిగిపోయాయని, ఎరువు లేక నష్టాలు తప్పవని వారు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బస్తారాంతండాకు వెంటనే యూరియా సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరిస్తున్నారు.


