ఆడే టైం అపోయిందనే రిటైర్మెంట్ తీసుకున్నా..!
రిటైర్మెంట్ నిర్ణయంపై అశ్విన్ తాజాగా కామెంట్స్
అప్పట్లో ఆస్ట్రేలియా సిరీస్ మధ్యలోనే అశ్విన్ నిర్ణయం
కుంబ్లే రికార్డు దాటే అవకాశాన్ని వదులుకున్న స్పిన్నర్
గౌతమ్ గంభీర్‌పై స్పష్టమైన వ్యాఖ్యలు
ఇగో వదిలేస్తేనే నిజం అర్థమవుతుందన్న స్టార్ బౌలర్
నా జీవితంపై నిర్ణయం నాదే అంటూ క్లారిటీ
కాకతీయ, స్పోర్ట్స్ : భారత క్రికెట్‌లో సంచలనంగా మారిన రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్‌పై ఆయన తాజాగా ఓపెన్‌గా మాట్లాడాడు. ఇండియా ఆస్ట్రేలియా సిరీస్ మధ్యలోనే రిటైర్ అవ్వడం అప్పట్లో అందరినీ షాక్‌కు గురిచేసింది. అయితే ఆ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాలను ఇప్పుడు స్పష్టంగా చెప్పాడు. డిసెంబర్ నెలలో బ్రిస్బేన్ టెస్ట్ తర్వాత అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. మొత్తం వంద ఆరు టెస్ట్ మ్యాచ్‌లలో ఐదు వందల ముప్పై ఏడు వికెట్లు తీసి భారత జట్టుకు రెండో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. కుంబ్లే తర్వాత ఈ స్థానం అతనిదే. ఇంకా ఆడితే ఆ రికార్డు దాటే అవకాశం ఉన్నప్పటికీ అశ్విన్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.
టీమ్‌లో సంకేతాలు కనిపించాయి
తన రిటైర్మెంట్ వెనుక టీమ్ కాంబినేషన్ కీలక కారణమని అశ్విన్ చెప్పాడు. పెర్త్ టెస్ట్ నుంచి పరిస్థితులు మారాయని, తాను, జడేజా ఇద్దరూ ఉన్నప్పటికీ వాషింగ్టన్ సుందర్‌కు అవకాశమివ్వడం, తర్వాత మళ్లీ తనను తప్పించడం తనకు స్పష్టమైన సంకేతమిచ్చిందని తెలిపాడు. ఇక కొత్త ప్లేయర్లకు స్థలం ఇవ్వాల్సిన సమయం వచ్చిందని అర్థమైందని చెప్పాడు. “నేను తిరిగి వచ్చే అవకాశం కోసం ఎదురుచూసే వ్యక్తిని కాదు. చాలాసార్లు కంబ్యాక్ చేశాను. ఇక అలాంటి పరిస్థితుల్లో ఉండాలనిపించలేదు” అని అశ్విన్ చెప్పాడు. కోచ్ గౌతమ్ గంభీర్‌పై వచ్చిన ఫేవరిటిజం ఆరోపణలపై కూడా అశ్విన్ క్లియర్‌గా స్పందించాడు. “ఎవరైనా గంభీర్‌పై అసహనం కలిగి ఉండాలంటే అది నేనే కావాలి” అంటూ సరదాగా ప్రారంభించాడు. కోచ్‌గా గంభీర్‌కు తన ప్లాన్ ప్రకారం టీమ్‌ను నడిపించే హక్కు ఉందని అశ్విన్ అన్నాడు. అవసరమైతే తాను, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలాంటివారు కూడా తప్పుకోవాల్సి వస్తుందని చెప్పాడు.
ఈగో వదిలేయాలి
తన తండ్రి కూడా ఈ విషయంపై బయట మాట్లాడిన సందర్భాలు ఉన్నాయని, కానీ తాను మాత్రం ఎప్పుడూ ఇతర ప్లేయర్ల గురించి చెడు మాటలు మాట్లాడొద్దని చెప్పానని అశ్విన్ తెలిపాడు. ఈగో వదిలేస్తేనే నిజమైన పరిస్థితి అర్థమవుతుందని, క్రికెట్‌లో ఎంత పెద్ద ప్లేయర్ అయినా ఎప్పటికైనా సైడ్ అవ్వాల్సిందేనని అశ్విన్ స్పష్టం చేశాడు. భారతదేశంలో లభించే క్రేజ్ వల్ల ప్లేయర్లు తాము ఎప్పటికీ అవుట్ కావని అనుకునే పరిస్థితి వస్తుందని, కానీ అది నిజం కాదని చెప్పాడు. చివరగా “నా జీవితం మీద నిర్ణయం తీసుకోవాల్సింది నేనే. అది సరైనదా కాదా అనేది ఇతరులు మాట్లాడుకోవచ్చు. కానీ నేను నా నిర్ణయంతో సంతోషంగా ఉన్నాను” అంటూ అశ్విన్ తన రిటైర్మెంట్‌పై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు.


