గడువు ముగిసినా గందరగోళమే!
ఓటర్ల జాబితాపై తొలగని అనుమానాలు
చివరి రోజున కూడా వెల్లువెత్తిన అభ్యంతరాలు
ఇప్పటి వరకు 249 మంది నుంచి ఫిర్యాదులు
ఓట్ల గల్లంతు.. జాబితాలో తప్పిదాలపై ఆందోళన
తుది జాబితాపై విశ్వాసం డోలాయమానమేనా..?!
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ నగరంలో విడుదలైన మున్సిపల్ ముసాయిదా ఓటర్ల జాబితా తీవ్ర గందరగోళానికి కేంద్రంగా మారింది. అభ్యంతరాల స్వీకరణకు నిర్ణయించిన గడువు ముగిసినప్పటికీ జాబితా ఖచ్చితత్వంపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలు ఏమాత్రం తగ్గడం లేదు. చివరి రోజున కూడా పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు నమోదు కావడంతో మొత్తం అభ్యంతరాల సంఖ్య 249కు చేరింది. ఇది ఓటర్ల జాబితా తయారీలో జరిగిన లోపాల తీవ్రతను స్పష్టంగా చాటుతోంది. ముసాయిదా జాబితా విడుదలైన మొదటి రోజు నుంచే అభ్యంతరాల వెల్లువ కొనసాగింది. గడువు చివరి రోజుకూ అదే పరిస్థితి కొనసాగడం అధికారుల పనితీరుపై విమర్శలకు దారి తీస్తోంది. ఒక డివిజన్‌కు చెందిన ఓట్లు మరో డివిజన్‌లో నమోదవడం, ఇంటి నంబర్లు లేకుండానే వందలాది ఓటర్ల పేర్లు జాబితాలో ఉండటం, కొన్ని డివిజన్లలో అకస్మాత్తుగా ఓట్ల సంఖ్య పెరగడం వంటి అంశాలు ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తున్నాయి.
66 డివిజన్లలోనూ లోపాలేనా?
నగరంలోని 66 డివిజన్లలోనూ ఓటర్ల జాబితా లోపాలతో నిండిపోయిందన్న అనుమానాలు బలపడుతున్నాయి. గత గణాంకాలకు పొంతన లేకుండా కొన్ని డివిజన్లలో ఓట్ల సంఖ్య భారీగా పెరగడం, మరికొన్నింటిలో తగ్గిపోవడం అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇంటి నంబర్లు, నివాస వివరాల ధృవీకరణ లేకుండా ఓటర్లను చేర్చడం వల్ల జాబితా ఖచ్చితత్వంపైనే కాదు, మొత్తం ఎన్నికల ప్రక్రియ పారదర్శకతపైన కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసినప్పటికీ కేవలం కొద్ది రోజుల్లోనే 249 ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సరిదిద్దడం సాధ్యమేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లోపాలతో కూడిన జాబితానే తుది రూపం దాలిస్తే రానున్న మున్సిపల్ ఎన్నికలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు, పౌరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడువు ముగిసినా ఓటర్ల జాబితాపై కొనసాగుతున్న ఈ గందరగోళం తుది జాబితా విశ్వసనీయతను ప్రశ్నార్థకంగా మారుస్తోంది. అధికారులు విడుదల చేయనున్న తుది ఓటర్ల జాబితా నిజంగా నమ్మకంగా ఉంటుందా? లేక కొత్త వివాదాలకు దారి తీస్తుందా? అన్న ఉత్కంఠే ఇప్పుడు కరీంనగర్ నగర రాజకీయ, సామాజిక వర్గాల్లో ప్రధాన చర్చగా మారింది.


