అధికారులు మారినా పేర్లు మారలే!
నంబర్లు మారినా కొత్త నంబర్లు రాయలే!!
చెన్నారావుపేట వ్యవసాయ కార్యాలయంలో అలసత్వం
కాకతీయ, నర్సంపేట టౌన్ : రైతులకు కీలకమైన వ్యవసాయ సలహాలు, ప్రభుత్వ పథకాల సమాచారం అందించాల్సిన వ్యవసాయ శాఖ కార్యాలయంలో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో ఇటీవల బదిలీల అనంతరం కొత్త ఏవోను నియమించి కార్యాలయాన్ని రైతు వేదికకు తరలించినప్పటికీ, పాత కార్యాలయం వద్ద ఈ మార్పును సూచించే బోర్డు ఏర్పాటు చేయలేదు. అంతేకాదు, బోర్డుపై ఇప్పటికే బదిలీ అయిన ఏడీఏ, ఏవో, ఏఈవో పేర్లు అలాగే ఉండగా, కొత్తగా కేటాయించిన ఫోన్ నంబర్లు ఎక్కడా పొందుపరచలేదు. రబీ సీజన్‌లో యూరియా పంపిణీ యాప్ ఆధారంగా సాగుతున్న నేపథ్యంలో, వివరాలు తెలుసుకోవడానికి రైతులు అధికారులను సంప్రదించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బోర్డులపై సరైన సమాచారం లేక గందరగోళం నెలకొంది. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి, అధికారుల పేర్లు, మొబైల్ నంబర్లను వెంటనే సరిచేసి రైతులకు సమయానుకూల సమాచారం అందించాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.


