అభివృద్ధికి అడ్డుగా ఏటూరునాగారం సర్పంచ్
మండల కాంగ్రెస్ నాయకుడు చిటమట రఘు
కాకతీయ, ఏటూరునాగారం : ములుగు జిల్లా ఏటూరునాగారంలో అభివృద్ధి పనులు రాజకీయ వివాదాలకు కేంద్రబిందువుగా మారాయి. జరుగుతున్న సైడ్ డ్రైన్ పనులకు స్థానిక సర్పంచ్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ బాబు అడ్డుపడుతూ, జేసీబీతో దౌర్జన్యంగా పూడ్చివేశారంటూ మండల కాంగ్రెస్ నాయకుడు చిటమట రఘు ఆరోపించారు. సర్పంచ్‌గా గెలిచిన కొద్ది రోజులకే నిరుపేద వాడాల్లో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడం ఏంటని ప్రజలు ఆలోచించాలని కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. ఈ అంశంపై మండల కాంగ్రెస్ నాయకుడు చిటమట రఘు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి సీతక్క చొరవతో రెండున్నరేళ్లలో వందల కోట్ల రూపాయలతో ఏటూరునాగారాన్ని అభివృద్ధి చేశామని కాంగ్రెస్ నేతలు తెలిపారు. సెంట్రల్ లైటింగ్ సిస్టం, బస్ డిపో మంజూరు, ఎన్‌ఆర్‌ఈజీఎస్, ఎస్సీ సబ్‌ప్లాన్, సీఆర్‌ఆర్ నిధులతో సుమారు 15 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు నిర్మించామని చెప్పారు. దేవాలయాలు, మసీదులు, ఈద్గాలు, ఖబరస్తాన్లు, చర్చిలు, పాఠశాలలు, ఆసుపత్రులకు కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ బాబు ఇటీవల ప్రెస్‌మీట్‌లో కాంగ్రెస్ హామీలపై ప్రశ్నలు లేవనెత్తడాన్ని కాంగ్రెస్ నేతలు తప్పుబట్టారు.


