కాకతీయ, తెలంగాణ బ్యూరో: ఉపరితల ఆవర్తన ప్రభావం కారణంగా తెలంగాణలో వాతావరణం తీవ్రంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఫిల్మ్‌నగర్, యూసఫ్‌గూడ, ఖైరతాబాద్, కోఠి, సుల్తాన్‌బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్‌బాగ్, లక్డీకపూల్, లిబర్టీ, హిమాయత్‌నగర్, నారాయణగూడ, లోయర్ ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్, కుత్బుల్లాపూర్, చింతల్, మల్కాజిగిరి, ముషీరాబాద్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షం పడింది. వర్షం కారణంగా రహదారులపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ తీవ్రంగా అంతరాయం ఏర్పడింది.
వికారాబాద్ జిల్లాలోని ధరూర్ మండలంలో కురిసిన భారీ వర్షంతో నాగసముద్రం–కోట్పల్లి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గొట్టిముక్కల, ద్యాచారం, నాగారం ప్రాంతాల్లో వాగులు ఉప్పొంగాయి. సంగారెడ్డి పట్టణం, జహీరాబాద్, జిన్నారం, కోహిర్ మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. కామారెడ్డి, దోమకొండ, బిక్కనూరు, మాచారెడ్డి, రాజంపేట మండలాల్లో మాత్రం తేలికపాటి వర్షపాతం నమోదైంది.
ములుగు జిల్లాలో లింగంపేట, తాడ్వాయి మండలాల్లో, అలాగే మెదక్ జిల్లాలో కొల్చారం, చిన్న శంకరంపేట, టేక్మల్ మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లా లింగాలలో 10 సెం.మీ., మొగడంపల్లి (సంగారెడ్డి)లో 9.8 సెం.మీ., పల్లెగూడెం (ఖమ్మం)లో 8.98 సెం.మీ., మేడారం (ములుగు)లో 8.43 సెం.మీ. వర్షపాతం నమోదైంది. అలాగే పుల్కల్ (సంగారెడ్డి)లో 7.45 సెం.మీ., గూడూర్ (జనగామ)లో 7.38 సెం.మీ., వికారాబాద్ జిల్లా ఖాసింపూర్, బషీరాబాద్ మండలాల్లో 7 సెం.మీ., పెరుమాండ్ల–సంకీస (మహబూబాబాద్)లో 7 సెం.మీ. వర్షం నమోదైంది. కొండాపూర్ (సంగారెడ్డి)లో 6.48 సెం.మీ., మోమిన్‌పేట్ (వికారాబాద్)లో 6.35 సెం.మీ., కూనారం (పెద్దపల్లి)లో 6.18 సెం.మీ., కాసిందేవిపేట (ములుగు)లో 8.78 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
మొత్తం రాష్ట్రం మీద వర్షాల దెబ్బకు రహదారులు, వాగులు పొంగిపొర్లి ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. వాతావరణ శాఖ ఇంకా కొద్ది రోజులపాటు వర్షాలు కొనసాగవచ్చని హెచ్చరించింది.


