ఈటల రాజేందర్ హౌస్ అరెస్ట్
కామారెడ్డి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు
ఏసీపీతో సహ భారీగా నివాసానికి చేరుకున్న బలగాలు
వెంకట రమణా రెడ్డి పరామర్శకు బయలుదేరిన ఈటల
ప్రభుత్వ వైఖరిపై తీవ్రంగా మండిపడ్డ బీజేపీ నేత
కాకతీయ, తెలంగాణ బ్యూరో : బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను పోలీసులు శనివారం హౌస్ అరెస్ట్ చేశారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి నివాసంపై జరిగిన దాడి నేపథ్యంలో ఆయనను పరామర్శించేందుకు కామారెడ్డి వెళ్లేందుకు సిద్ధమైన ఈటలను పోలీసులు అడ్డుకున్నారు. ఆయన నివాసానికి ఏసీపీ ఆధ్వర్యంలో భారీగా పోలీసులు చేరుకుని బయటకు వెళ్లకుండా నిరోధించారు. వెంకట రమణా రెడ్డి ఇంటిపై జరిగిన దాడి ఘటనను తీవ్రంగా పరిగణించిన ఈటల రాజేందర్, బాధిత ఎమ్మెల్యేను పరామర్శించేందుకు కామారెడ్డికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని భావించిన పోలీసులు ముందస్తు చర్యగా ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. నివాసం వద్ద పోలీసులు మోహరించి ఈటల బయటకు వెళ్లకుండా నిరోధించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ పోలీసుల చర్యలపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజాప్రతినిధిని తన సహచర ఎమ్మెల్యేను పరామర్శించేందుకు కూడా అనుమతించకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి ప్రతిపక్ష నేతలను అణచివేయాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ వైఖరి ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్న ఈటల, కాంగ్రెస్ పార్టీ గుండాయిజం చేస్తూ ప్రజాస్వామ్య విలువలను ఖూనీ చేస్తోందని విమర్శించారు. ప్రజల హక్కులను అణగదొక్కే ప్రయత్నాలను సహించబోమని, ఇలాంటి చర్యలకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
ప్రతిపక్ష నాయకుల కదలికలను అడ్డుకోవడం ద్వారా ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి కూడా సమాన హక్కులు ఉన్నాయని, వాటిని కాలరాస్తే ప్రజలే తగిన తీర్పు ఇస్తారని పేర్కొన్నారు. ఈటల రాజేందర్ హౌస్ అరెస్ట్ ఘటన రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుండగా, బీజేపీ నేతలు మాత్రం దీనిని తీవ్రంగా ఖండిస్తున్నారు.


