సమిష్టి కృషితోనే బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సాధ్యం..
జిల్లాలో పారిశ్రామిక, పని ప్రదేశాల్లో స్పెషల్ డ్రైవ్..
కమిషనర్ ఆఫ్ పోలీస్ సన్ ప్రీత్ సింగ్..
కాకతీయ, హనుమకొండ : ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతోనే బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించవచ్చని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ స్పష్టం చేశారు.
ఆపరేషన్ స్మైల్–12 కార్యక్రమంలో భాగంగా మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వరంగల్, హనుమకొండ, జనగాం జిల్లాల అధికారులు, పోలీసులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో అదనపు డీసీపీ ఎన్. రవి అధ్యక్షతన నిర్వహించిన సమన్వయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీపీ సన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. బాల కార్మిక నిర్మూలన నిబంధనల ప్రకారం జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతాలు, షాపులు, ప్రమాదకర పని ప్రదేశాల్లో కార్మిక శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీస్ యూనిట్, చైల్డ్ హెల్ప్‌లైన్, స్కోప్, షేర్, ఎఫ్‌ఎమ్‌ఎమ్ సామాజిక సేవా స్వచ్ఛంద సంస్థల సహకారంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. గతంలో నిర్వహించిన ఆపరేషన్ స్మైల్–ముష్కాన్ కార్యక్రమం ద్వారా 339 మంది బాలలను రక్షించామని, 26 ఎఫ్‌ఐఆర్‌లు, 160 ఐఆర్‌లు నమోదు చేసినట్లు తెలిపారు. 14 సంవత్సరాల లోపు బాల బాలికలు పనిచేస్తున్నట్లు గుర్తిస్తే బాల కార్మిక నిర్మూలన చట్టం ప్రకారం, 18 సంవత్సరాల లోపు బాలబాలికలు పనిచేస్తున్నట్లు గుర్తిస్తే బాలల న్యాయ చట్టం ప్రకారం సంబంధిత యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. స్పెషల్ డ్రైవ్ విజయవంతం కావాలంటే అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని, రోజు వారీ నివేదికలను కార్మిక శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో సేకరించి సమర్పించాలని సీపీ సూచించారు. ఈ కార్యక్రమంలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఇన్‌స్పెక్టర్ శ్యామ్ సుందర్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ వినోద్, ఎన్‌సీఎల్పీ డైరెక్టర్ బుర్ర అశోక్ కుమార్, బాలల సంక్షేమ సమితి ఛైర్మన్లు ఉప్పలయ్య, వసుధ, సభ్యులు డాక్టర్ పరికి సుధాకర్, జిల్లా బాలల పరిరక్షణ అధికారులు ఎస్. ప్రవీణ్ కుమార్, ఎల్. రవికాంత్, ఉమా, చైల్డ్ హెల్ప్‌లైన్ కోఆర్డినేటర్లు ఎస్. భాస్కర్, కల్పన, రవికుమార్,
ఏ హెచ్ టి యూ ఎస్‌ఐలు సుధాకర్, భాగ్యలక్ష్మి, డబ్ల్యూ ఏ ఎస్ ఐ సముద్దీన్, హెచ్‌సీ, పీసీలు శ్రీనివాస్, రాము, ఎఫ్‌ఎమ్‌ఎమ్‌ఎస్‌ఎస్ సంస్థ ప్రోగ్రాం మేనేజర్ బత్తుల కరుణ, ప్రోగ్రాం ఆఫీసర్ ఎర్ర శ్రీకాంత్, మై ఛాయిస్ ఫౌండేషన్ రాష్ట్ర కోఆర్డినేటర్ జన్ను క్రాంతి, షేర్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి బి. జమున, డివిజన్ ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది, కార్మిక శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.



