సీసీ కెమెరాలతో నేరాల నిర్మూలన
* ప్రతి గ్రామంల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలి
* సీఐ రమేష్ నాయక్, ఎస్సై అపూర్వ రెడ్డి
కాకతీయ,చేర్యాల: గ్రామాల్లో, పట్టణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో నేరాలను నిర్మూలించవచ్చని, ఎవరైనా నేరాలకు పాల్పడిన వెంటనే గుర్తించేందుకు వీలుంటుందని చేర్యాల సీఐ రమేష్ నాయక్, ఎస్సై అపూర్వ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం రోజురోజుకూ సీసీ కెమెరాల ప్రాధాన్యత పెరుగుతున్నదని,గ్రామాల్లో నేరాల నియంత్రణ ప్రజలకు భద్రత కల్పించేందుకు సీసీ కెమెరాలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయని వారు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చేర్యాల పోలీస్ స్టేషన్ లో శనివారం నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులతో సీసీ కెమెరాల పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ, ఎస్సై మాట్లాడుతూ. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గుతుండడంతో గ్రామీణ, పట్టణ ప్రజలు తమ నివాస ప్రాంతాల్లో బిగించుకునేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. దీనికి తోడు పోలీస్ అధికారులు గ్రామాల్లో పర్యటించి ఏర్పాటుపై అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. పోలీసులకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడుతున్నట్లు సూచించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు కోసం ప్రజలు, వ్యాపారులు సహకరించాలని సీఐ,ఎస్సై కోరారు. ఈ అవగాహన సదస్సులో చేర్యాల మున్సిపల్ కౌన్సిలర్లు, మండలంలోని ఆయా గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.



