సమానత్వమే నిజమైన ప్రజాస్వామ్యం డాక్టర్ బీఆర్ అంబేద్కర్
రాజ్యాంగ దినోత్సవం హుజురాబాద్‌లో అంబేద్కర్ సేవలను స్మరించిన జేఏసీ నాయకులు
కాకతీయ,హుజురాబాద్ : భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జేఏసీ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. అఖిల భారత అంబేద్కర్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాడుగుల ఓదెలు ఆధ్వర్యంలో నేతలు పుష్పగుచ్ఛాలు సమర్పించి సత్కరించారు.ఈ సందర్భంగా మాట్లాడిన బీసీ జేఏసీ గౌరవాధ్యక్షులు చందుపట్ల జనార్ధన్.రాజ్యాంగ నిర్మాణం కోసం నిద్రలేని రాత్రులు గడిపి, తన సంపూర్ణ జీవితాన్ని జాతికి అంకితం చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు భారత ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచి ఉంటుందని చెప్పారు.
భారతదేశాన్ని సంపూర్ణ స్వతంత్ర, ప్రజాస్వామ్య, సమానత్వాధారిత గణతంత్రంగా తీర్చిదిద్దడంలో అంబేద్కర్ చేసిన సేవలు అపూర్వమని పేర్కొన్నారు.ప్రతి పౌరుడు ఇతరుల హక్కులను గౌరవిస్తూ, రాజకీయంగా,ఆర్థికంగా,సామాజికంగా సమానత్వం నెలకొల్పడానికి కృషి చేయాలని తెలిపారు.
దేశ సార్వభౌమాధికారాన్ని రక్షించడం, జాతీయ సమైక్యతను కాపాడటం ప్రతి భారత పౌరుడి ధర్మమని అభిప్రాయపడ్డారు.కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పంజాల రామ్ శంకర్, బీసీ జేఏసీ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు సందేల వెంకన్న, చిలకమారి శ్రీనివాస్, ఇప్పకాయల సాగర్, దాసరి మల్లేశం, ఇప్పలపల్లి చంద్రశేఖర్, గోస్కుల మధుకర్ తదితరులు పాల్గొన్నారు.


