రెండు పార్టీలకు సమాన దూరం
బీఆర్ఎస్ బైకాట్ వెనుక స్పష్టమైన వైఖరి
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ నగరపాలక సంస్థ పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సమాన దూరం పాటిస్తూ బీఆర్ఎస్ ఓటింగ్‌ను బహిష్కరించినట్లు స్పష్టం చేశారు. ఈ రెండు పార్టీలు తమ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయని, కాంగ్రెస్ నేతలు కేసీఆర్ అరెస్ట్ అంశాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు చేయడం, బీజేపీ కూడా తమపై ఆరోపణలు చేయడం వంటి కారణాలతో బైకాట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నగర అభివృద్ధి పేరుతో ప్రజలకు హామీలు ఇచ్చిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కరీంనగర్‌కు నిధులు తీసుకురావడంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన మేనిఫెస్టోలను అమలు చేసి నగర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం నగరంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను కొనసాగించాలని సూచించారు. ప్రజలకు పుట్టినప్పటి నుంచి మరణ ధ్రువపత్రాల వరకు సంబంధం ఉన్న మున్సిపల్ సేవలను నిర్లక్ష్యం చేయొద్దని హెచ్చరించారు. నగర పాలనలో అవినీతి, అక్రమాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వబోమని, బీఆర్ఎస్ కార్పొరేటర్లు “డేగ కన్ను”లా మున్సిపాలిటీ పనితీరును పర్యవేక్షిస్తారని స్పష్టం చేశారు. ఎక్కడ అవినీతి జరిగినా ఉద్యమాలు, ధర్నాలతో బహిర్గతం చేస్తామని హెచ్చరించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో తమకు ఎలాంటి దోస్తీ లేదని, ప్రజా ప్రయోజనాల పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమని సర్దార్ రవీందర్ సింగ్ స్పష్టం చేశారు.


