బియ్యం స్టాక్ పంపిణీ సకాలంలో జరిగేలా చూడాలి
ఖమ్మం అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి
కాకతీయ,ఖమ్మం : సన్న బియ్యం స్టాక్ పంపిణీ సకాలంలో జరిగేలా చూడాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్, బఫర్ గోదాంలకు అలాట్మెంట్ చేసిన జిపిఓలు, సంబంధిత అధికారులతో 3 నెలల బియ్యం స్టాక్ పంపిణీపై సమీక్షించారు.
అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ఏప్రిల్ నుంచి జూన్- 2026 వరకు గల 3 నెలల రేషన్ ను ఒకేసారి అందించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని అన్నారు. మూడు నెలల రేషన్ సరఫరాకు సంబంధించి 12 బఫర్ గోదాములకు 12 మంది జిపిఓ లను ఇంచార్జి లుగా నియమించడం జరిగిందని, 3 నెలల రేషన్ లబ్దిదారులకు పంపిణీ చేసేందుకు వీలుగా రేషన్ షాపుల వారీగా స్టాక్ పంపిణీ జరిగేలా చూడాలని అన్నారు. బఫర్ గోడౌన్ నుంచి స్టేజి 1 ద్వారా ఎం.ఎల్.ఎస్. పాయింట్ లకు రేషన్ సరఫరా సకాలంలో పంపిణి చేయాలని, మన జిల్లా అవసరాలకు 25 వేల మెట్రిక్ టన్నులు, ఇతర జిల్లాల కోసం పంపిణి చేసే బియ్యం క్వాంటిటి కూడా సరిగ్గా ఉండేలా చూడాలని అన్నారు. బియ్యం పంపిణీ ప్రతి రోజూ ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాలని అన్నారు. ఎం.ఎల్.ఎస్. పాయింట్ నుంచి రేషన్ షాపులకు బియ్యం తరలింపు కూడా ఉదయం 9 గంటలకు ప్రారంభించాలని అదనపు కలెక్టర్ తెలిపారు. హమాలీలు సకాలంలో అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు.ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ శ్రీలత, ఎం.ఎల్.ఎస్. పాయింట్ ఇంచార్జి, స్టేజి 1 కాంట్రాక్టర్, గోడౌన్ ఇంచార్జి లు, జిపిఓలు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


