భూసేకరణ పరిహారంపై ప్రతిష్టంభనకు తెర
ఎకరాకు 18.50 లక్షలు కోరుతున్న రైతులు
ఎమ్మెల్యే చొరవతో చర్చలు వేగం
కాకతీయ, కారేపల్లి : రైల్వే డబుల్ లైన్ భూసేకరణలో రైతులకు గరిష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ కోరారు. రైతులకు అన్యాయం జరగకుండా త్వరగా అవార్డు ఖరారు చేయాలని సూచించారు. సింగరేణి మండల పరిధిలో డోర్నకల్ నుంచి భద్రాచలం రోడ్ వరకు ప్రతిపాదించిన ప్రాజెక్టులో కోమట్లగూడెం గేట్, కారేపల్లి, కమలాపురం ప్రాంతాల రైతుల భూములు సేకరిస్తున్నారు. పరిహారం అంశంపై ఇటీవల కలెక్టర్ కార్యాలయంలో సమావేశం జరిగింది. రైతులు ఎకరాకు 19 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయగా అధికారులు 18 లక్షల వరకు ఇవ్వవచ్చని తెలిపారు. ఎకరాకు 18.50 లక్షలు ఇస్తేనే భూములు ఇస్తామని రైతులు తమ నిర్ణయాన్ని తెలియజేశారు. ఈ మేరకు జాయింట్ కలెక్టర్ శ్రీజకు వినతిపత్రం సమర్పించారు. సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే చొరవ తీసుకుని కలెక్టర్‌తో మాట్లాడారు. గాదెపాడు సర్పంచ్ భూక్యా రంజిత్ కుమార్ నేతృత్వంలో రైతులు జాయింట్ కలెక్టర్‌ను కలిశారు. మరోసారి సమావేశం నిర్వహించి అధికారికంగా పరిహారం ప్రకటించాలని కోరారు. కమలాపురానికి చెందిన కోటి అప్పారావు, పాండియా నాయక్, మహిళా రైతులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే చొరవతో పరిహారం పెంపుపై సానుకూల నిర్ణయం వస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


