కాకతీయ కథనాలతో కదిలిన విద్యుత్ శాఖ
మేడారంలో జాతరలో పవర్ కట్లతో భక్తులకు ఇబ్బందులు
కాంట్రాక్టర్ నిర్లక్ష్య పనులపై కాకతీయలో వరుస కథనాలు
ఆలస్యంగానైఆ దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టిన అధికారులు
రెడ్డిగూడెంలో నూతన లైన్ల ఏర్పాటు

కాకతీయ, ములుగు ప్రతినిధి : మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరలో విద్యుత్ శాఖ వైఫల్యాలు తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. జాతర సమయంలో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో లక్షలాది మంది భక్తులు నానా అవస్థలు పడ్డారు. ఈ సమస్యలను కాకతీయ దినపత్రిక వరుస కథనాల రూపంలో ఫోటోలతో సహా వెలుగులోకి తేవడంతో విద్యుత్ శాఖలో చలనం వచ్చింది. అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. జాతర వేళ విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడటంతో రాత్రి వేళల్లో మేడారం పరిసర ప్రాంతాలు చీకటిమయంగా మారాయి. దర్శన క్యూలైన్లు, తాత్కాలిక దుకాణాలు, భక్తుల శిబిరాలు అంధకారంలో మునిగిపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అత్యవసర సమయాల్లో పవర్ కట్లు రావడం అధికారుల పనితీరుపై తీవ్ర విమర్శలకు దారి తీసింది.

మధ్యలోనే ఆగిపోయిన పనులు
విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో జాతర ఏర్పాట్ల కోసం కాంట్రాక్ట్ తీసుకున్న సంస్థ పనుల్లో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించినట్లు ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా రెడ్డిగూడెం గ్రామ పరిసరాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనులు అర్ధాంతరంగా నిలిపివేయడంతో సమస్యలు మరింత తీవ్రమయ్యాయి. రోడ్లపై విద్యుత్ స్తంభాలను అడ్డంగా వదిలేయడంతో పాదచారులు ఇబ్బందులు పడ్డారు. చీకట్లో స్తంభాలకు తగిలి కొంతమంది గాయపడిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ఈ దుస్థితిని కాకతీయ దినపత్రిక క్షేత్రస్థాయి నుంచి ఫోటోలతో సహా ప్రచురించడంతో అధికారులు స్పందించక తప్పలేదు. కథనాల ప్రభావంతో విద్యుత్ శాఖ మధ్యలో నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించింది.
కొత్త లైన్ల ఏర్పాటుతో ఊరట
కథనాల అనంతరం రెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో నూతన విద్యుత్ లైన్ల ఏర్పాటు పనులను అధికారులు వేగవంతం చేశారు. భక్తులకు నిరంతర విద్యుత్ సరఫరా అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టామని అధికారులు వెల్లడించారు. జాతర ముగిసినప్పటికీ, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా శాశ్వత పరిష్కార దిశగా పనులు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. జాతరలో తలెత్తిన విద్యుత్ సమస్యల వెనుక కాంట్రాక్టర్ ఎంపిక విధానమే ప్రధాన కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో వరదలు, జాతరల సమయంలో స్థానిక అనుభవజ్ఞులైన కాంట్రాక్టర్లతో పనులు చేయించి అధికారులు సమర్థవంతంగా విద్యుత్ పునరుద్ధరణ చేపట్టేవారు. కానీ ఈసారి హైదరాబాద్కు చెందిన కొత్త కాంట్రాక్టర్కు పనులు అప్పగించడంతో సమన్వయ లోపం ఏర్పడిందని విమర్శలు వినిపిస్తున్నాయి.
స్థానిక పరిస్థితులపై అవగాహన లేని సంస్థకు బాధ్యతలు ఇవ్వడం వల్లే పనులు అస్తవ్యస్తంగా మారాయని స్థానికులు మండిపడుతున్నారు. జాతరకు వారం రోజుల ముందే పనులు పూర్తయ్యాయని అధికారులు ప్రకటించినప్పటికీ, వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉండటంతో భక్తులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల తీరుపై అసహనం
జాతర సమయంలో వరుస పవర్ కట్లు, మధ్యలో ఆగిపోయిన పనులు, భద్రతా లోపాలు అధికారుల పనితీరుపై అనేక సందేహాలను రేకెత్తించాయి. కాకతీయ కథనాల ప్రభావంతో ఇప్పుడిప్పుడే అధికారులు దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నా, ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లే ఇంతటి అవ్యవస్థ నెలకొందని ప్రజలు విమర్శిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, అనుభవజ్ఞులైన స్థానిక కాంట్రాక్టర్లను భాగస్వాములను చేస్తూ పకడ్బందీ ప్రణాళికతో పనిచేయాలని భక్తులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కాకతీయ కథనాల వల్లే సమస్యలకు పరిష్కారం దొరికిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.


