విద్యుత్ సమస్యలను పరిష్కారించాలి
సర్పంచ్ ముదిరెడ్డి కళావతి
కాకతీయ ఇనుగుర్తి : మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సర్పంచ్ ముదిరెడ్డి కళావతి శ్రీనివాసరెడ్డి కోరారు. మంగళవారం విద్యుత్ శాఖ ఏఈ భార్గవిని మర్యాదపూర్వకంగా కలిసి గ్రామంలో ఎదురవుతున్న కరెంటు సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ఏఈ భార్గవి హామీ ఇచ్చినట్లు సర్పంచ్ తెలిపారు. సర్పంచ్ మాట్లాడుతూ… గ్రామంలో ప్రధానంగా విద్యుత్ కేబుల్ వైర్ మార్పు అవసరమైందని, సర్వం తండ పరిధిలో 25కి పైగా కనెక్షన్లు ఉండటంతో అక్కడ ప్రత్యేకంగా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అలాగే ట్రాన్స్ఫార్మర్లకు ఆన్–ఆఫ్ సౌకర్యం లేకపోవడంతో ఫ్యూజ్లు పోయిన ప్రతిసారి సబ్స్టేషన్ నుంచి ఎల్సీ తీసుకుని పనిచేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలన్నింటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరినట్లు తెలిపారు. సమావేశం అనంతరం ఏఈ భార్గవిని శాలువాతో సత్కరించి సన్మానించారు. విద్యుత్ శాఖ అధికారి సానుకూలంగా స్పందించి గ్రామంలోని అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని సర్పంచ్ తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు, సర్పంచ్ భర్త ముదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.


