పారదర్శకంగా ఎన్నికలు జరగాలి
ఎన్నికల నిర్వహణలో జాగ్రత్త ముఖ్యం
ప్రీసైడింగ్ అధికారులకు కలెక్టర్ రాహుల్ శర్మ సూచనలు
కాకతీయ, గణపురం: పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు.శనివారం మండలంలోని రైతు వేదికలో ప్రీసైడింగ్, స్టేజి-2 అధికారుల శిక్షణా తరగతులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గ్రామ పంచాయితీ ఎన్నికల నిర్వహణలో ఏవైనా సందేహాలుంటే శిక్షణల్లోనే నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో జాగ్రత్తగా, ప్రశాంత వాతావరణంలో పని చేయాలని ఆదేశించారు. 10వ తేదీన పోలింగ్ మెటీరియల్ స్వీకరించి కేటాయించిన కేంద్రాలకు చేరుకోవాలని, 11వ తేదీ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమయ్యేలా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన తెలిపారు. పోలింగ్ రహస్య పద్ధతిలో జరగాలని, కంపార్ట్‌మెంట్‌లు సరిగ్గా ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్ ప్రారంభానికి ముందు ఏజెంట్ల సంతకాలు తప్పనిసరిగా తీసుకోవాలని, పోలింగ్ సమయ ముగింపు నాటికి కేంద్రంలో వేచి ఉన్న ఓటర్లందరికీ వరుసగా స్లిప్పులు జారీ చేయాలని సూచించారు. పోలింగ్ ముగిసిన రెండు గంటలకే ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుందని, అందుకు కావాల్సిన ఏర్పాట్లు ఇప్పుడే పూర్తిచేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి డా కుమారస్వామి, తహసీల్దార్ సత్యనారాయణ స్వామి, ఎంపిడిఓ భాస్కర్, మాస్టర్ ట్రైనర్లు ఎస్ శ్రీధర్, బి.రఘునాధ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


