- జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ
కాకతీయ, వరంగల్ బ్యూరో : భూపాలపల్లి జిల్లాలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగడానికి రాజకీయ పార్టీలు పూర్తిస్థాయిలో సహకరించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. మంగళవారం ఐడిఓసీ కార్యాలయ కాన్ఫరెన్స్ హాలులో జరిగిన సమావేశంలో కలెక్టర్ రాజకీయ పార్టీల నేతలతో సమావేశమై ఎన్నికల నిబంధనలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోమవారం నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినట్లు తెలిపారు. అనుమతి లేకుండా ఎలాంటి సమావేశాలు, సభలు నిర్వహించరాదని హెచ్చరించారు.
రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు, వాల్‌రైటింగ్ వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించరాదని, ఓటర్లను ప్రలోభ పెట్టే చర్యలు నేరమని తెలిపారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే నేరుగా లేదా సి-విజిల్ యాప్ ద్వారా లైవ్ వీడియోతో, అలాగే 1950 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా 24 గంటల్లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వివరించారు.
రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్‌స్పీకర్ల వాడకానికి అనుమతి లేదని, ఆలయాలు, మసీదులు, చర్చిలు, పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో సమావేశాలు, ప్రచారాలు నిర్వహించరాదని సూచించారు. భూపాలపల్లి మున్సిపాల్టీకి ఎన్నికల కోడ్ వర్తించదని, అయితే అక్కడ కూడా ఫ్లెక్సీలు, పోస్టర్లు, టీవీ ప్రకటనల ద్వారా ఓటర్లను ప్రలోభ పెట్టరాదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మీ, డీపీఓ శ్రీలత, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.


