పొరపాట్లకు తావు లేకుండా ఎన్నికలు నిర్వహించాలి
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద
కాకతీయ, గీసుగొండ: రానున్న రెండో సాధారణ పంచాయతీ ఎన్నికలను పూర్తిస్థాయి పారదర్శకతతో, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. మండలంలోని ఎలుకుర్తి హవేలీ గ్రామపంచాయతిలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియను ఆమె ప్రత్యక్షంగా పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ సత్య శారద మాట్లాడుతూ..ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశ క్షుణ్ణంగా ఉండాలని, నామినేషన్ల పరిశీలన సమయంలో అభ్యర్థులు సమర్పించిన పత్రాలను ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా సరిచూసి రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. నామినేషన్ దశ నుండి ఫలితాల ప్రకటన వరకు ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్ స్వీకరణ, పరిశీలన,తుది అభ్యర్థుల జాబితా,పోస్టల్ బ్యాలెట్ పంపిణీ, ఫోటో ఓటర్ స్లిప్పుల పంపిణీ,మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు, పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు, ఓటింగ్ నిర్వహణ, లెక్కింపు,ప్రతి అంశంపై అధికారులు అప్రమత్తంగా వ్యవహరించా లని ఆమె స్పష్టం చేశారు. నామినేషన్ల పరిశీలన అనంతరం అర్హులు, అనర్హుల పూర్తి వివరాలతో జాబితాను సిద్ధం చేయాలని, ఎన్నికల గుర్తుల కేటాయింపులో ప్రత్యేక శ్రద్ధ చూపించాలని ఆమె సూచించారు. విధులు నిర్వర్తించే అధికారులు ఎన్నికల నియమావళిని పూర్తిగా పాటించాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎండి రియాజుద్దీన్,ఎంపీఓ పాక శ్రీనివాస్,సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.


