ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి
లోపాలకు తావులేకుండా చూడాలి: కలెక్టర్ పమేలా సత్పతి
కాకతీయ, కరీంనగర్ : మూడవ (చివరి) విడతగా నిర్వహించనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను ఎలాంటి లోపాలు లేకుండా, అత్యంత సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి ఎన్నికల సిబ్బందిని ఆదేశించారు.
గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలు-2025లో భాగంగా కరీంనగర్ జిల్లాలో ఈ నెల 17న చివరి విడత పోలింగ్ జరగనుంది. జమ్మికుంట, ఇల్లందకుంట, హుజురాబాద్, వీణవంక, వి.సైదాపూర్ మండలాల్లోని గ్రామ పంచాయతీలకు సర్పంచి, వార్డు సభ్యుల ఎన్నికలకు పోలింగ్ నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా హుజురాబాద్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. ప్రతి కౌంటర్‌ను, ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఎన్నికల సిబ్బందితో మాట్లాడి, పోలింగ్ కేంద్రాలకు వెళ్లే ముందు ఎన్నికల సామాగ్రిని చెక్‌లిస్ట్ ప్రకారం జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు. ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే జోనల్, రూట్ అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ పోలింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని, ఎప్పటికప్పుడు జిల్లా కేంద్రానికి నివేదికలు అందజేయాలని అధికారులకు సూచించారు. పోలింగ్ సిబ్బందికి ఏర్పాటు చేసిన భోజన ఏర్పాట్లను కూడా కలెక్టర్ పరిశీలించారు. రూట్, జోనల్, నోడల్ అధికారులు అప్రమత్తంగా ఉండి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, చివరి దశ పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమేష్ బాబు పాల్గొన్నారు.


