ఎన్నికలు నిబంధనల ప్రకారం నిర్వహించాలి
రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ. రాణి కుముదిని
కాకతీయ, కరీంనగర్: పంచాయతీ ఎన్నికలను నిబంధనలకు అనుగుణంగా సక్రమంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ. రాణి కుముదిని గురువారం పేర్కొన్నారు. ఎన్నికల పద్ధతులపై సమీక్ష కోసం ఆమె జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.వీడియో కాన్ఫరెన్స్‌లో కరీంనగర్ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే, జనరల్ అబ్జర్వర్ వెంకటేశ్వరు పాల్గొన్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాల ప్రకటన, ఏకగ్రీవ స్థానాలలో ఉపసర్పంచ్ ఎన్నిక, పోస్టల్ బ్యాలెట్ ఏర్పాటు, నామినేషన్లపై వచ్చిన ఫిర్యాదుల నివారణ వంటి అంశాలపై కమిషనర్ సమగ్రంగా రివ్యూ చేశారు.రాజ్య ఎన్నికల సంఘం కమిషనర్ ఐ. రాణి కుముదిని తన సూచనల్లో ముఖ్యంగా తెలిపారు.వార్డు సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామాల్లో ఉప సర్పంచ్ నియామకం నిబంధనల ప్రకారం జరిగేలా చూసుకోవాలి. ఏకగ్రీవంగా ఎంపికైన గ్రామ సర్పంచ్ పోస్టుల ఫలితాలను ఫారం 10 ప్రకారం ప్రకటించాలి. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత స్టేజ్ 2 రిటర్నింగ్ అధికారుల నియామకాలను సమయానికి పూర్తి చేయాలి. అలాగే, టి-పోల్ సిస్టంలో రిపోర్టులు పండింగ్ లేకుండా నమోదు చేయడం, ప్రతి గ్రామ పంచాయతీకి వచ్చిన వాలీడ్ నామినేషన్ వివరాలను అప్‌డేట్ చేయడం అవసరం.పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసిన ప్రతి అభ్యర్థికి సౌకర్యం కల్పించడానికి, ప్రతి మండలంలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని, బ్యాలెట్ పేపర్ ముద్రణ నిబంధనల ప్రకారం జరుగుతుందని కమిషనర్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో ఎటువంటి నియమావళి ఉల్లంఘనలు జరుగకుండా పక్కా నిఘా ఏర్పాటు చేయాలని కూడా సూచించారు.ఈ సందర్భంగా లా అండ్ ఆర్డర్ అదనపు డిజిపి మహేష్ భగవత్ మాట్లాడుతూ.పంచాయతీ ఎన్నికల సమయంలో అక్రమ నగదు, మద్యం, ఆభరణాలు ద్వారా ఓటర్లను ప్రలోభం ఇచ్చే ప్రయత్నాలు గుర్తించిన వెంటనే సీజ్ చేయాలని, పోలింగ్ నాడు సరిహద్దు ప్రాంతాల్లో అంతరాష్ట్ర చెక్‌పోస్ట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ధాన్యం కొనుగోలు సీజన్ నడుస్తున్నందున రైతుల వద్ద ఉన్న ఆధారాలను పరిశీలించి, పంట డబ్బులకు సరైన ఆధారాలు ఉంటే సీజ్ చేయవద్దని హైలైట్ చేశారు.వీడియో కాన్ఫరెన్స్‌లో డిఆర్ఓ వెంకటేశ్వరు, జడ్పీ సీఈఓ శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్, ఇతర నోడల్ అధికారులు పాల్గొన్నారు.


