రేపే క్యాతన్ పల్లి చైర్ పర్సన్ ఎన్నిక
కట్టుదిట్టమైన ఏర్పాట్లు.. పోలీసుల గట్టి బందోబస్తు
కాకతీయ, రామకృష్ణాపూర్ : అధికార,ప్రతిపక్ష పార్టీల మధ్య తలెత్తిన వివాదాలతో వాయిదా పడిన క్యాతన్ పల్లి చైర్,వైస్ చైర్ పర్సన్ల ఎన్నిక శనివారం అధికారికంగా జరగనుంది. జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పీ.చంద్రయ్య సమక్షంలో జరిగే ఎన్నిక ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ శుక్రవారం పూర్తి చేశారు. ఉన్నత అధికారుల సూచనలు,ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం కౌన్సిలర్ అభ్యర్థుల కొరకు ప్రత్యేక కుర్చీలను కట్టు దిట్టమైన భద్రత చర్యల మధ్య ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఇప్పటికే క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో 144 సెక్షన్ (బి.ఎన్.ఎస్.ఎస్ 163) అమల్లో ఉందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా ఎన్నిక సజావుగా జరిగేందుకు పోలీస్ భద్రత బలగాలను రంగంలోకి దింపారు. బెల్లంపల్లి ఏసిపి కిరణ్ కుమార్,మందమర్రి సీఐ పర్ష రమేష్,పట్టణ ఎస్సై జాడి శ్రీధర్ నేతృత్వంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తుంది. ఎవరైనా సభలు,సమావేశాలు,ర్యాలీ నిర్వహించాలంటే పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. పై నిబంధనలను ఉల్లంఘిస్తే పోలీస్ శాఖ తరఫున కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అందరి చూపు క్యాతన్ పల్లి వైపు
స్థానిక క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన కౌన్సిలర్లకు చైర్ పర్సన్,వైస్ చైర్ పర్సన్ ఎన్నిక వాయిదా పడడంతో సంతోషం లేకుండా పోయింది. వాయిదా పడిన రోజు నుంచి ఇప్పటి వరకు బీఆర్ఎస్ & సీపీఐ కౌన్సిలర్లు క్యాంప్ బాట పట్టారు. సుమారు 46 రోజుల తర్వాత జరుగుతున్న ఎన్నికపై అందరిలో ఆసక్తి నెలకొంది. మొత్తంగా రాష్ట్ర ప్రజలందరి చూపు క్యాతన్ పల్లి ఎన్నిక వైపు అనే చందంగా పరిస్థితులు తయారయ్యాయి. ఇన్ని కట్టు దిట్టమైన భద్రత చర్యల మధ్య శనివారం జరిగే ఎన్నిక సజావుగా సాగుతుందా..? లేదా అడ్డంకులు సృష్టించి వాయిదా వేస్తారా అనేది వేచి చూడాల్సిన అంశంగా చెప్పవచ్చు. అయితే ఆశించిన మెజారిటీ స్థానాలను (14) సాధించిన బీఆర్ఎస్ & సీపీఐ పార్టీలకే చైర్ పర్సన్,వైస్ చైర్ పర్సన్ పీఠాలు దక్కుతాయని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు చైర్ పర్సన్,వైస్ చైర్ పర్సన్ కుర్చీల కోసం ఏమైనా మిరాకిల్ చేస్తారా..? లేదా..? అనేది ఓపికతో చూడాల్సిందే.


