కాకతీయ, తెలంగాణ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై ఈసీ ఫోకస్ పెట్టింది. సోమవారం జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ కీలక ప్రకటన చేశారు. ఈసీ సూచన మేరకు పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ అభ్యంతరాలను ఈనెల 26వ తేదీలోగా సమర్పించాలని ఆయన సూచించారు. సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. స్పెషల్ సమ్మరీ రివిజన్ ప్రక్రియలో భాగంగా పోలీస్ స్టేషన్ రేషనలైజేషన్ పై ఈ ప్రత్యేక సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి. కర్ణన్ మాట్లాడుతూ… ఇప్పటివరకు ఉన్న 320 పోలింగ్ స్టేషన్ల స్థానంలో 408 పోలింగ్ స్టేషన్లు ప్రతిపాదించామని తెలిపారు. గతంలో 132 లొకేషన్లలో పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా, ప్రస్తుతం 139 లొకేషన్లలో ప్రతిపాదించామని వివరించారు. అదనంగా 79 కొత్త పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ రేషనలైజేషన్ నివేదికను ఈ నెల 28వ తేదీ లోగా ఎన్నికల కమిషన్‌కు పంపించాల్సి ఉన్నందున, అభ్యంతరాలను 26వ తేదీ లోగా తప్పనిసరిగా సమర్పించాలని కమిషనర్ సూచించారు.
బూత్ లెవెల్ ఏజెంట్లు
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 329 పోలింగ్ స్టేషన్లకు బూత్ లెవెల్ అధికారులు (BLOలు) అందుబాటులో ఉన్నారని కమిషనర్ తెలిపారు. అయితే, కొన్ని రాజకీయ పార్టీలు మాత్రమే బూత్ లెవెల్ ఏజెంట్‌ల జాబితా సమర్పించాయని, ఇంకా ఇవ్వని పార్టీలు వెంటనే జాబితా అందజేయాలని కోరారు. కొత్తగా ఏర్పాటు చేసిన 79 పోలింగ్ స్టేషన్లకు బూత్ లెవెల్ అధికారులను త్వరలోనే నియమిస్తామని చెప్పారు.
క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్
జనవరి 6 నుండి ఆగస్టు 15 వరకు మొత్తం 19,237 ఓటర్ల నమోదు దరఖాస్తులు అందగా, అందులో 3,767 తిరస్కరించబడ్డాయని, ఇంకా 16 పెండింగ్‌లో ఉన్నాయని కమిషనర్ వివరించారు. ఫారం 6 ద్వారా వచ్చిన 5,426 దరఖాస్తుల్లో 1,478 తిరస్కరించబడ్డాయని, ఫారం 7 ద్వారా వచ్చిన 3,453 దరఖాస్తుల్లో 1,010 తిరస్కరించబడ్డాయని, 12 పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఫారం 8 ద్వారా వచ్చిన 10,358 దరఖాస్తుల్లో 1,279 తిరస్కరించబడ్డాయని తెలిపారు.
ఈ సమావేశంలో ఎల్‌బి నగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎన్నికల అదనపు కమిషనర్ మంగతాయారు, జూబ్లీహిల్స్ డిప్యూటీ కమిషనర్ ఈవోఆర్. రజనీకాంత్ రెడ్డి, తహసీల్దార్లు, రాజకీయ పార్టీల తరఫున బహుజన్ సమాజ్ పార్టీ నుండి నందేష్ కుమార్, భారతీయ జనతా పార్టీ నుండి పి. వెంకటరమణ, పవన్ కుమార్, సుప్రియ గౌడ్, ఆమ్ ఆద్మీ పార్టీ నుండి విజయ్ మల్లంగి, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) నుండి ఎం. శ్రీనివాసరావు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుండి రాజేష్ కుమార్, తెలుగుదేశం పార్టీ నుండి బి.వై. శ్రీకాంత్, విజయ రత్న, AIMIM పార్టీ నుండి సయ్యద్ ముస్తాక్ కలియుల్లా తదితరులు పాల్గొన్నారు.


