సమ్మక్క–సారలమ్మ జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు
జనవరి 28–31 వరకు జాతర నిర్వహణ
సమన్వయంతో పనిచేయాలి : కలెక్టర్ పమేలా సత్పతి
కాకతీయ, కరీంనగర్ : జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు జరగనున్న శ్రీ సమ్మక్క–సారలమ్మ జాతరకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. దేవాదాయ, ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో జాతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
జాతర ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్, హైమాస్ లైట్లు, తాత్కాలిక మరుగుదొడ్లు, తాగునీటి సరఫరా, విద్యుత్, రోడ్డు భద్రత వంటి అంశాల్లో శాఖల మధ్య సమన్వయం ఉండాలని సూచించారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ జిల్లాలో 21 ప్రాంతాల్లో జాతర నిర్వహించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా రేకుర్తి, హుజురాబాద్, కేశవపట్నం, వీణవంక, జూపాక, చల్లూరు, చింతకుంట, హౌసింగ్ బోర్డు కాలనీల్లో భక్తులు అధికంగా హాజరవుతారని చెప్పారు. అందువల్ల పోలీస్ బందోబస్తు, మెడికల్, ఫైర్ సేవలతో పాటు సురక్షిత వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, ఆర్టీసీ రీజినల్ మేనేజర్, పంచాయతీ అధికారులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.


