కాకతీయ, వరంగల్ బ్యూరో: వరంగల్ జిల్లా కలెక్టరేట్లో మంగళవారం రోజున కుడా చైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి, జి డబ్ల్యు ఎం సి కమిషనర్ చాహత్ బాజ్పాయ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి లతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సత్య శారద సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇన్నర్ రింగ్ రోడ్ భూసేకరణ పురోగతి పనులు త్వరగా పూర్తి చేయాలని, గుండు చెరువు భూ నిర్వాసితులకు పరిహారం చెల్లింపు,పర్యాటక ప్రదేశంగా ఉరుసుగుట్ట అభివృద్ధి చేయాలనీ,కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో గ్రీనరీ పెంచాలని,చెరువులకు ఎఫ్డిఎల్ ల ఏర్పాటు తదితర అంశాల పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. సమర్థ నిర్వహణకు అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ కుడా చైర్మన్ ఇనగల వెంకట్రాం రెడ్డితో కలిసి గతంలో పలుమార్లు సందర్శించి ఏకవీరదేవి దేవాలయాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుటకు చేయాల్సిన పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఏకవీర దేవి దేవాలయం చుట్టూ ఫెన్సింగ్ పూర్తయిందని, ప్రధాన ద్వారం, రహాదారి ఏర్పాటు చేయడం జరిగిందని అధికారులు తెలుపగా ఇంకను మిగిలి ఉన్న విద్యుత్, మంచినీటి, సూచిక బోర్డులు, గ్రామంలోని విగ్రహాలను సేకరించడం వంటి పనులు వేగవంతంగా పూర్తి చేసి ప్రపంచ పర్యాటక దినోత్సవం అయినా సెప్టెంబర్ 27 నాటికి పూర్తిచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో రెవెన్యూ అధికారి విజయలక్ష్మి, ఇరిగేషన్ ఎస్ ఈ రాంప్రసాద్, ఈఈ కిరణ్ కుమార్, టీజీఐఐసీ జోనల్ మేనేజర్ స్వామి, జిల్లా ఉద్యానవన అధికారి శ్రీనివాసరావు, ఎస్ ఇ ఎన్పిడిసిఎల్ గౌతమ్ రెడ్డి, ఆర్డీవో సత్యపాల్ రెడ్డి, కుడా పిఓ అజిత్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


