ఎనిమిది మంది మావోయిస్టుల లొంగుబాటు
ప్రభుత్వ పునరావాస పథకాలపై నమ్మకంతో నిర్ణయం
అజ్ఞాత మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలి
రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా
కాకతీయ, రామగుండం : నిషేధిత సీపీఐ (మావోయిస్టు) పార్టీకిచెందిన ఎనిమిది మంది మావోయిస్టులు శుక్రవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ ఎదుట లొంగిపోయారు. మిలీషియా, కొరియర్, సాంస్కృతిక విభాగం, లోకల్ కమిటీకి చెందిన సభ్యులు అంబర్ కిశోర్ ఝా సమక్షంలో కమిషనరేట్ కార్యాలయంలో లొంగుబాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖ లొంగిపోయిన మావోయిస్టుల పట్ల చూపుతున్న ఆదరణ, పునరావాస పథకాల వివరాలు తెలుసుకున్న అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంత జీవితం గడపాలనే ఉద్దేశంతో వీరు లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. లొంగిపోయిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అందించే పునరావాస పథకాల కింద అన్ని రకాల ప్రయోజనాలు అందిస్తామని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు.
ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో కార్యకలాపాలు
లొంగిపోయిన ఎనిమిది మంది మావోయిస్టులు మిలీషియా, కొరియర్, సాంస్కృతిక విభాగం, లోకల్ కమిటీ వంటి విభాగాల్లో క్రియాశీలకంగా పనిచేశారు. వీరి కార్యకలాపాలు ప్రధానంగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో కొనసాగినట్లు పోలీసులు వెల్లడించారు. ధర్మాజీ శ్రీకాంత్ (జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం ఇటీక్యాల గ్రామం) 2019 నుంచి మావోయిస్టు పార్టీలో కొరియర్‌గా పనిచేశాడు. 2024లో వాజేడు పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్టై జైలు నుంచి విడుదలైన అనంతరం తిరిగి పార్టీలో చేరి సీనియర్ నాయకులకు కొరియర్‌గా వ్యవహరించాడు. పొడియం కాములు మిలీషియా కమాండర్‌గా పనిచేస్తూ స్థానిక సమీకరణలో కీలక పాత్ర పోషించాడు. ముడియం జోగ చైతన్య సాంస్కృతిక విభాగానికి చెందిన నాట్య మండలితో సంబంధం కలిగి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. కుంజం లక్కె పార్టీ సభ్యురాలిగా ఉండి ఆంధ్రి ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకుంది. మోదం భీమ, ముడికం సుక్రం, ముడియం మంగు మిలీషియా సభ్యులుగా అడవి కమిటీ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. కుంజం ఉంగా గూడాచార విభాగం కమాండర్‌గా సమాచారం సేకరణ, లాజిస్టిక్స్ బాధ్యతలు నిర్వహించాడు. లొంగిపోయిన వారిలో శ్రీకాంత్ ఒక్కరే తెలంగాణకు చెందినవాడని, మిగిలినవారు ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా గాంగేలూరు పోలీస్ స్టేషన్ పరిధి గ్రామాలకు చెందినవారని పోలీసులు తెలిపారు.
అజ్ఞాత మావోయిస్టులకు పిలుపు
అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని రామగుండం కమిషనరేట్ పోలీసులు పిలుపునిచ్చారు. గ్రామాలకు తిరిగివచ్చే వారికి తెలంగాణ ప్రభుత్వం పునరావాస పథకాలు, జీవనోపాధి అవకాశాలు కల్పిస్తుందని స్పష్టం చేశారు. “పోరు వద్దు – ఊరు ముద్దు” అంటూ అజ్ఞాత మావోయిస్టులు సమాజంలోకి రావాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు డీసీపీ (పరిపాలన) శ్రీనివాస్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఇన్‌స్పెక్టర్లు రాజేంద్రప్రసాద్, భీమేష్, ఆర్‌ఐ శేఖర్, ఆర్‌ఎస్‌ఐలు వెంకట్, శివ తదితరులు పాల్గొన్నారు.


