రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కృషి
తెలంగాణ రాష్ట్ర పురావస్తు సంచాలకులు కుతడి అర్జున రావు
కాకతీయ, ఆత్మకూరు : రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని తెలంగాణ రాష్ట్ర పురావస్తు శాఖ సంచాలకులు ప్రొఫెసర్ అర్జునరావు తెలిపారు. శుక్రవారం హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం కటాక్షపూర్ గ్రామంలో ఉన్న రాష్ట్ర రక్షిత కట్టడమైన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ఆలయాల స్థితిగతులను పరిశీలించి మాట్లాడారు. అభివృద్ధి కోసం పురావస్తు శాఖ సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకొని భక్తులకు పర్యాటకులకు ఆలయాల చరిత్ర తెలియజేసే విధంగా సైన్ బోర్డులు, వివరణాత్మక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా, ఆలయ గోడలపై ఉన్న వైట్‌వాష్‌ను వెంటనే రసాయనిక శుద్ధి (కెమికల్ క్లీనింగ్) చేసి, శిల్ప సంపదను చరిత్రను భక్తులు, పర్యాటకులు స్పష్టంగా చూడగలిగేలా చేయాలని ఆదేశించారు. దేవాలయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దేవాలయ అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసంచాలకులు డాక్టర్ పి. నాగరాజు, ఎన్. నర్సింగ్ నాయక్, అర్చకులు గందే సంపత్ , మాజీ సర్పంచ్ యాదగిరి గౌడ్, మండల అధికార ప్రతినిధి ఎం ఏ గపూర్, మారపెళ్లి రాజన్న, కమిటీ అధ్యక్షులు నిమ్మల నాగరాజు, ఉపాధ్యక్షులు మత్తి వెంకటేష్ , ప్రధాన కార్యదర్శి దేశవతు రాజేందర్, నూతన గంటి సతీష్, ఓన్నాల చిన్ని, వటుకుల రవీందర్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు..


