కాకతీయ, వరంగల్ బ్యూరో : భూపాల పల్లి జిల్లా కేంద్రంలో శనివారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇసుక దోపిడీపై నిరసనలు హోరెత్తాయి. ఇటీవల టేకుమట్ల మండల కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ, భూపాలపల్లి పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు కటకం జనార్దన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు దిష్టి బొమ్మలకు శవయాత్ర నిర్వహించి, అనంతరం వాటిని దహనం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ ఎస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జి గండ్ర వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ.. భూపాలపల్లి నియోజకవర్గం, టేకుమట్ల మండలంలో ఇసుక దోపిడీపై తాము ధర్నా చేసినా ప్రభుత్వ యంత్రాంగం స్పందించడం లేదన్నారు.
రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అన్న అనుమానం కలుగుతోందని విమర్శించారు. తాము ప్రజల పక్షాన పోరాడుతుంటే పోలీసులు అడ్డుకోవడం విడ్డూరమన్నారు. గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం కాంగ్రెస్ నేతల ప్రోద్భలంతో ఇసుక దోపిడీ యథేశ్చగా కొనసాగుతోందని ఆరోపించారు. ఇలానే కొనసాగితే గోదావరి పరివాహక ప్రాంతం ఎడారిగా మారడం ఖాయమన్నారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా ఇసుక దోపిడీ చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. తాము ఇసుక దోపిడీకి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తుంటే కాంగ్రెస్ నేతలు పోటీ ధర్నాలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, మండల అధ్యక్షుడు సట్ల రవి, యూత్ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.


