కాకతీయ, తెలంగాణ బ్యూరో: తాను దేశం విడిచి పారిపోవడానికి ప్లాన్ చేస్తున్నాననే పుకార్లకు చెక్ పెట్టారు నేపాల్ మాజీ ప్రధాని, సీపీఎన్-యూఎంఎల్ అధ్యక్షుడు కేపీ శర్మ ఓలీ.. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం తన భద్రతను, అధికారిక విశేషాధికారాలను లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని శర్మ నేపాలీ ప్రభుత్వంపై మండిపడ్డారు. భక్తపూర్, గుండూలో జరిగిన ఒక సభలో ఓలీ మాట్లాడుతూ.. తాను దేశం విడిచి ఎక్కడికీ వెళ్లనని స్పష్టం చేశారు. ఇక్కడే ఉండి రాజకీయ పోరాటం చేయాలనేది తన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వం ఏం చేస్తోంది..
సుశీలా కర్కీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజల ఇష్టంతో కాకుండాదహనం, ధ్వంసం ద్వారా అధికారంలోకి వచ్చిందని ఒలీ విమర్శించారు. నిరసనల సమయంలో తాను అధికారులకు ఇచ్చిన సూచనలు ఏవైనా ఉన్నాయంటే వాటిని బయట పెట్టాలని ప్రభుత్వాన్ని సవాల్ చేశారు. వాటిని ధైర్యంగా ప్రచురించాలని, తాను ఏమీ దాచిపెట్టలేదని అన్నారు. దేశంలో శాంతి, సుశాసనం, రాజ్యాంగ పరిపాలనను పునరుద్ధరించడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో బహిరంగంగా తన నివాసంపై దాడి చేయాలని పిలుపులు వస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం ఏం చేస్తోంది? చూస్తూ కూర్చుందా? అని ప్రశ్నించారు.


