విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలి
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోతుకు ప్రవీణ్ కుమార్
కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవన్‌లో అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) జిల్లా సమితి సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోతుకు ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై పోరాటాలను మరింత ఉధృతం చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. విద్యారంగానికి 15% బడ్జెట్ కేటాయించాలని, పెండింగ్‌లో ఉన్న రూ.9వేల కోట్ల స్కాలర్షిప్‌లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ములుగులో నెలకొన్న అనేక విద్యా సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఆయన కోరారు. గిరిజన యూనివర్సిటీకి అధిక నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన జాతీయ విద్యా విధానంను వెంటనే రద్దు చేసి, దేశవ్యాప్తంగా ఒకే విధమైన కామన్ ఎడ్యుకేషన్ పాలసీ అమలు చేయాలని ప్రవీణ్ కుమార్ అన్నారు. ఏఐఎస్ఎఫ్ ములుగు జిల్లా మహాసభలు డిసెంబర్ 22, 23 తేదీల్లో నిర్వహిస్తామని తెలిపారు. ఈ మహాసభల్లో విద్యారంగ సమస్యల పరిష్కారానికి భవిష్యత్ పోరాట కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు. మహాసభలను విద్యార్థులు, మేధావులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి కుమ్మరి సాగర్, పగిడి అన్వేష్, కొండగొర్ల సాయికుమార్, రణదీప్, చెన్నూరు రాంచరణ్, దుర్గం శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.


