విద్యే మహిళలకు నిజమైన శక్తి
సమానత్వ పోరాటానికి పూలే మార్గదర్శకం
ఏసీపీ మాధవి, సీఐ రామకృష్ణ గౌడ్ పిలుపు
కాకతీయ, హుజురాబాద్ : భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, మహిళా విద్యకు మార్గదర్శకురాలు సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలు హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో ఘనంగా నిర్వహించారు. కోరపల్లి మాజీ సర్పంచ్, సామాజిక కార్యకర్త బోయిని లావణ్య–సమ్మయ్య, యూత్ కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా జనరల్ సెక్రటరీ పింగిలి చైతన్య–రమేష్ ఆధ్వర్యంలో వెంకటేశ్వర్లపల్లి గ్రామం, జమ్మికుంట పట్టణాల్లో జయంతి కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏసీపీ మాధవి, పట్టణ సీఐ రామకృష్ణ గౌడ్ హాజరై సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మహిళలు, వివిధ ప్రజాసంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మహిళా విద్యతోనే సమాజ మార్పు
ఈ సందర్భంగా ఏసీపీ మాధవి మాట్లాడుతూ, మహిళల విద్య కోసం తన జీవితాన్ని అంకితం చేసిన సావిత్రిబాయి పూలే సేవలు సమాజానికి ఎప్పటికీ మార్గదర్శకమని అన్నారు. విద్య ద్వారా మహిళలు ముందుకు సాగితేనే కుటుంబం, సమాజం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. అమ్మాయిలు చదువులో ముందుండి స్వతంత్రంగా నిలబడాలని పిలుపునిచ్చారు.
సమానత్వానికి పూలే చూపిన దారి
పట్టణ సీఐ రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ, సమానత్వం, సామాజిక న్యాయం కోసం సావిత్రిబాయి పూలే చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. మూఢనమ్మకాలను ఎదిరించి మహిళల విద్యకు బాటలు వేసిన ఆమె ఆశయాలను ప్రతి ఒక్కరూ జీవితంలో అమలు చేయాలని సూచించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులు బోయిని లావణ్య–సమ్మయ్య, పింగిలి చైతన్య–రమేష్‌కు పలువురు అభినందనలు తెలిపారు


