విద్యే పేదరికానికి శాశ్వత విముక్తి మార్గం కలెక్టర్ కోయ శ్రీ హర్ష
జాతీయ విద్యా దినోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్
కాకతీయ, పెద్దపల్లి : విద్య ద్వారానే పేదరికం నుంచి శాశ్వత విముక్తి సాధ్యమని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జాతీయ విద్యా దినోత్సవం,మైనారిటీ సంక్షేమ దినోత్సవం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ డి. వేణు, జిల్లా అధికారులు హాజరయ్యారు.కలెక్టర్ మాట్లాడుతూ,స్వాతంత్ర్యానంతరం మొదటి ప్రధానమంత్రి నెహ్రూ కేబినెట్‌లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారని గుర్తుచేశారు. ఆయన పుట్టినరోజు జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు.ఆజాద్ హిందీ, అరబిక్, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రావీణ్యం సాధించిన పండితుడని, పదకొండు సంవత్సరాలపాటు విద్యాశాఖ మంత్రిగా సేవలందించారని తెలిపారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు విద్య అందేలా కులమత భేదాలు లేకుండా కృషి చేసిన మహనీయుడని కొనియాడారు.విద్య ద్వారానే పేదరికం నిర్మూలన సాధ్యమని, ప్రతి పేదవాడి ఇంటికి విద్య చేర్చాలనే దృక్పథంతో ఆయన పనిచేశారని అన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మైనారిటీ విద్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి, గురుకుల పాఠశాలలను స్థాపించిందని వివరించారు. ముఖ్యంగా మైనారిటీ బాలికల విద్యపై ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ సమాన అవకాశాలు కల్పిస్తోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ శాఖ అధికారి రంగారెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


